మేడ్చల్, మార్చి31(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న గ్రామాల రైతులకు ఇప్పటి వరకు రైతు భరోసా అందలేదు. వ్యవసాయం సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా వర్తింపజేస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నేరవేర్చడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకుని ఉన్న గ్రామాలలో రైతులు లేరా తమకు ఎందుకు రైతు భరోసా ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. రైతు భరోసా పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు రూ.6 కోట్లు మాత్రమే రైతు భరోసా ద్వారానే రైతుల ఖాతాల్లో జమ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధును రూ. 33 కోట్లు జమ చేశారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. రైతులకు ఇచ్చిన ఏ కొక హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని రైతుల బతుకులను ఆగం చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతు భరోసా ఇచ్చ్చేందుకు గుర్తించిందే తక్కువ ఎకరాలు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో యాసంగిలో రైతు భరోసా ఇచ్చేందుకు గుర్తించింది 14,300 ఎకరాలకే ఇందులో అందరికి రైతు భరోసా అందలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యాసంగిలో ఎకంగా 64, 700 ఎకరాలకు రైతు భరోసాను అధికారులు కట్ చేశారు.
రైతులందరికి రైతు భరోసాను అందించాలి
యాసంగిలో వ్యవసాయం సాగు చేసిన రైతులందరికీ రైతు భరోసాను అందించాలి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకుని ఉన్న గ్రామాల రైతులకు ఏ ఒక్కరికి కూడ రైతు భరోసా అందలేదు. ఔటర్ రింగురోడ్డుకు అనుకుని గ్రామాలలో వ్యవసాయం సాగు చేసేవారు రైతులు కాదా. యాసంగిలో అనేక మంది రైతులకు రైతు భరోసా కట్ చేయడం సరైందికాదన్నారు. కష్టపడి వ్యవసాయం సాగు చేసే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు.
– మధుకర్‌రెడ్డి, శామీర్‌పేట్ సొసైటీ చైర్మన్