కొడంగల్, జనవరి 20 : జిల్లా పరిధిలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లాలోని 560 గ్రామాల్లో గ్రామానికి కనీసంగా 10 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం డీఎస్పీ శ్రీనివాస్‌తో కలిసి కొడంగల్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి నియోజకవర్గ పరిస్థితులపై సిబ్బందితో ఆరా తీశారు. ఈ సందర్భంగా విలేరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతల దృష్ట్యా గ్రామాల్లో దాతల సాయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రణాళిక చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్‌హెచ్-163 మన్నెగూడ నుంచి కొడంగల్ సరిహద్దు రహదారి వరకు 16 ప్రమాద స్థలాలను గుర్తించామని, ఆ ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు వంటివి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పూర్తి ప్రణాళికబద్దమైన చర్యలు తీసుకోవడంతోపాటు పీడీ యాక్ట్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా సిబ్బందితో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పోలీస్‌స్టేషన్‌లో క్రౌడ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 90శాతం వరకు సిబ్బంది బూస్టర్ డోస్ తీసుసుకున్నారన్నారు. ఉద్యోగుల సర్దుబాటులో భాగంగా జిల్లాకు 125 మంది ఆయా జిల్లాల నుంచి వచ్చారని, వీరికి అన్నింటా భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలో అన్ని పోలీస్స్టేషన్లలో ఆశించనంత మేర పూర్తిస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉన్నారని, మొత్తంగా 1244 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపారు. హైవే పరిరక్షణలో భాగంగా ఏర్పాటైన హైవే పోలీస్స్టేషన్లలో సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాను అరికట్టనున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో ఎస్ఐ సమ్యానాయక్, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌ను కూడా ఎస్పీ సందర్శించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి
బొంరాస్‌పేట, జనవరి 20 : హైదరాబాద్-బీజాపూర్ 163వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నివారించడానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం బొంరాస్‌పేట పోలీస్‌స్టేషన్‌ను ఆయన సందర్శించి విలేకరులతో మాట్లాడారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయో గుర్తించి నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు స్టేషన్‌లోని పలు రికార్డులను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి సూచనలు, సలహాలిచ్చారు. కార్యక్రమంలో పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ఉన్నారు.
ట్రాఫిక్ సిగ్నల్స్‌పై అవగాహన కల్పించాలి
వికారాబాద్, జనవరి 20 : రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, అప్పుడే ప్రమాదాల సంఖ్యను తగ్గించగలుగుతామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత, ప్రమాదాల నియంత్రణపై ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.