పెద్దేముల్, జనవరి 28 : అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి అంగన్వాడీ టీచర్ కచ్చితంగా 14 రకాల రిజిస్టర్లలో పకడ్బందీగా వివరాలను నమోదు చేయాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాణి అన్నారు. శనివారం మండల పరిధిలోని పాషాపూర్, బాయిమీదితండా, సిద్ధన్నమదుగుతండా, తట్టేపల్లి, బండమీదిపల్లి గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారుల బరువులను ప్రతి నెల 1న నమోదు చేసి అదే నెల 5లోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలుసెంటర్కు వచ్చి భోజనం చేసేలా, ప్రతి నెల ఆరోగ్యలక్ష్మి మీటింగ్ పెట్టేలా చర్యలు చేపట్టాలన్నారు. టీచర్లు కచ్చితంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉండాలన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, బాలామృతం, గుడ్లను క్రమం తప్పకుండా అందించాలన్నారు. అంతకుముందు ప్రతి సెంటర్లో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? ఈ రోజు ఎంతమంది హాజరయ్యారు? మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? రిజిస్టర్లను అప్డేట్ చేస్తున్నారా? విద్యార్థుల బరువులు ప్రతి నెల నెలా క్రమం తప్పకుండా తీస్తున్నారా? లేదా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని సిబ్బందిని అడిగి తెలుసుకొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సరస్వతి, సవిత, బాలమణి, నాగమణి, ఆయాలు, చిన్నారులు ఉన్నారు.