Hydraa | తుర్కయంజాల్,జూలై 9: మాసబ్ చెరువు నాలా పూడికతీత పూర్తిస్థాయిలో జరగకపోతే భవిష్యత్తులో కాలనీలు మునిగిపోయే పరిస్థితి ఉందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి ఆయన మాసాబ్ చెరువు నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రంగారెడ్డి మాట్లాడుతూ.. మాసబ్ చెరువు నాలా పూడికతీత పూర్తిస్థాయిలో జరగకపోతే వచ్చే సంవత్సరానికి పలు కాలనీలు మునిగిపోయే పరిస్థితి ఉందని అన్నారు.
అనంతరం హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అభ్యర్ధన మేరకు మాసబ్ చెరువు నాలా పరిశీలనకు వచ్చినట్లు తెలిపారు. మాసబ్ చెరువు పై నుంచి దిలావర్ ఖాన్ చెరువుకు వచ్చే నాలా కిలోమీటర్‌కు పైగా కబ్జాకు గురి అయిందని అన్నారు. చెరువులు, కుంటలలో నిర్మాణాలు చేపడితే కొద్దిగా తవ్విన నీరు వచ్చి ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. మాసబ్ చెరువు నుంచి పెద్ద అంబర్‌పేట మీదుగా మూసీ వరకు గల ఏడున్నర కిలోమీటర్ల నాలాను ఇప్పిటికే డ్రోన్ ద్వారా మ్యాపింగ్ చేసినట్లు ఆయన తెలిపారు. డ్రోన్ మ్యాపింగ్‌లో కూడా నాలా వెడల్పు తక్కువైన ప్రాంతాలను గుర్తించామని తెలిపారు.
తుర్కయంజాల్ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి ఇప్పుడు సరైన టైంలో నాలాను శుభ్రం చేయకపోతే భవిష్యత్‌లో నాలాను పూడికతీత తీసే పరిస్థితి కూడా ఉండకపోచ్చునని రంగనాథ్ అన్నారు. నాలాను సరైన సమయంలో పూడికతీత తీయడం ద్వారా వరదల ద్వారా జరిగే నష్టాన్ని నివారించవచ్చునని అన్నారు. మాసబ్ చెరువు నాలా పూడికతీతను ఓ మోడల్ కేసుగా తీసుకోని నాలాపై జరిగిన ఆక్రమణలను గుర్తించి భవిష్యత్‌లో ఆక్రమణలు అడ్డుకోవడానికి కృషి చేస్తామని తెలిపారు. నివాస ప్రాంతాలకు మినహయింపు ఇచ్చివారికి ప్రభుత్వం నుంచి సహయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాలాను కబ్జా చేసి ఏర్పాటు చేసిన కమర్షియల్ నిర్మాణాలపై కచ్చితంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మాసబ్ చెరువు నాలా వెడల్పును శాస్త్రీయ పద్దతిలో నిర్ణయిస్తామని తెలిపారు. నాలా వెడల్పు నిర్ధారణను రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, హైడ్రా బృందం, శాటిలైట్ ద్వారా తీసుకున్న మ్యాప్‌ల ద్వారా చర్చించి చేస్తామని తెలిపారు.ఇప్పుడు తీసుకునే చర్యలు ద్వారా మరో 30 నుంచి 40 ఏండ్ల వరకు ఎలాంటి సమస్యలు తలెత్తవని అన్నారు.