బడంగ్‌పేట, జూన్ 22 : సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర పరువు తీస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. మహేశ్వరం మండలంలోని మన్సాన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత మర్యాద రాఘవేందర్రెడ్డితోపాటు వందలాది మంది కార్యకర్తలు ఆమె సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా.. వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సభాస్థలికి వచ్చి మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి అధికారం కోసం అమలుకాని హామీలిస్తూ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని బజారుకు ఈడుస్తున్నారన్నారు.
పింఛన్లను రూ.నాలుగు వేలకు పెంచకుండా.. మహిళలకు రూ.2,500 ఇస్తామని ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అర్హులకు ఇప్పటికి కూడా రేషన్ కార్డు రాలేదని ఎద్దేవా చేశారు. కొత్త పింఛన్లు ఎంతమందికి మంజూరు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని రైతు భరోసా వేస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు.
రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ బాగా ఉన్నదని.. వ్యవసాయ భూములే లేవని సీఎం రేవంత్‌రెడ్డి రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీని నిలిపేయడంపై ఆమె మండిపడ్డారు. గత బీఆర్ఎస్ హయాంలో రూ.159 కోట్లను ఒక మహేశ్వరం మండలానికే అందినట్లు ఆమె గుర్తు చేశారు. జిల్లాలోని పలు మండలాల్లో రైతు భరోసాను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని.. అందుకే ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజూనాయక్, పాండుయాదవ్, వెంకటేశ్వరరెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.