వికారాబాద్, ఆగస్టు 19, (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలో రోడ్లు అధ్వానంగా మారాయి. జిల్లాలో వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా గ్రామీణ రోడ్లతోపాటు జిల్లా కేంద్రం, వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్లు పూర్తిగా గుంతలమయమయ్యాయి. జిల్లాలో ఎక్కడా చూసినా రోడ్లన్నీ కంకర తేలి, గుంతలు పడి, వర్షం నీరు నిలిచి బురదమయంగా మారిపోయాయి. అంతేకాకుండా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయి గుంతలను తలపిస్తున్నాయి.
ప్రధానంగా జిల్లా కేంద్రం పరిధిలోని వికారాబాద్-హైదరాబాద్ వెళ్లే దారి మొత్తం గుంతలుగా దర్శనమిస్తుండడం గమనార్హం. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ అంతటా రోడ్లు అధ్వానంగా మారిపోయాయి. కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. కొన్ని తండాలకు, గ్రామాలకు వెళ్లే రోడ్లు కొట్టుకుపోవడంతో వాహనాలు వదిలేసి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా గ్రామాల్లోనూ అయితే రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.
మండల కేంద్రాల నుండి గ్రామాలకు వెళ్లే రోడ్లతోపాటు గ్రామాల్లో అంతర్గత రోడ్లు ఎక్కడా చూసిన బురద, గుంతలతో దర్శనమిస్తున్నాయి. నవాబుపేట్ మండల కేంద్రం సమీపంలో అయితే రోడ్డు మరీ ఘోరంగా తయారైంది. రోడ్డు అంతా కొట్టుకుపోగా కేవలం కంకరరాళ్లు, గుంతలు మిగిలాయి. స్థానిక ఎమ్మెల్యేకు ప్రజలు పలుమార్లు విన్నవించినా పట్టించుకోకుండా పెడచెవిన పెడుతున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవాబుపేట్ మండల కేంద్రంతోపాటు ఎక్మామిడి వద్ద అడుగుకో గుంత ఏర్పడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అధ్వానంగా మారిన రోడ్డుతో ఎక్మామిడి మీదుగా నవాబుపేట్ వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. గ్రామాలు, తండాల్లో అయితే రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. కొన్ని రోడ్లన్నీ బురదతోపాటు పెద్ద పెద్ద గుంతలు ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గుంతల రోడ్లపై అంబులెన్స్ డ్రైవర్లు కూడా ఇబ్బందులు పడుతుండడంతో సమయానికి ఆసుపత్రులకు చేరుకోలేకపోతున్నారు.
వికారాబాద్-మోమిన్పేట్ వెళ్లే రహదారి, మోమిన్పేట్-మర్పల్లి రోడ్డు, వికారాబాద్-కోట్పల్లి రోడ్డు, బొంరాసుపేట్ మండల కేంద్రం నుండి గ్రామాలకు వెళ్లే రోడ్లు, దౌల్తాబాద్ మండలంలోని రోడ్లు, తాండూరు-పెద్దేముల్ వెళ్లే రోడ్లు, మోమిన్పేట్-శంకర్పల్లి వెళ్లే రోడ్డు, నవాబుపేట్ మండల కేంద్రంలోని రోడ్లన్నీ పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో ద్విచక్రవాహనాలపై వెళ్లే వాహనదారులకు ప్రమాదాలు జరుగుతున్నాయి. దోమ మండలం అయినాపూర్, పూడూర్ మండలం చన్గొముల్-మన్నెగూడ రోడ్డు అయితే మరీ అధ్వాన్నంగా తయారైంది.
వికారాబాద్ నుండి నస్కల్ మీదుగా పరిగి రహదారిలో మద్గుల్ చిట్టంపల్లి వాగు బ్రిడ్జితోపాటు పరిగి సమీపంలోని వాగుపై ఉన్న బ్రిడ్జిలు గుంతలు పడి ప్రమాదకరంగా మారింది. భారీ వరద వస్తే బ్రిడ్జిలు పూర్తిగా కొట్టుకుపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ గుంతలు పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నా మరమ్మత్తులపై పాలకులు పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఏడాదిన్నరలో ఒక్క రూపాయి కూడా రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేయకపోవడం గమనార్హం.