Radhika Sarathkumar | సినిమా టికెట్ రేట్లు ఇటీవల భారీగా పెరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు థియేటర్లలో భారీ ధరలు వసూలు చేస్తున్నారు. ప్రేక్షకులు సినిమాను చూడాలంటే 1000 నుంచి 2000 రూపాయల వరకు టికెట్ ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కలెక్షన్లు పెంచుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇలా టికెట్ రేట్లు పెంచుతున్నారని చాలామంది విమర్శిస్తున్నారు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా కూడా మొదటి వీకెండ్ ముగిసే వరకు టికెట్ ధరలను తగ్గించకుండా కొనసాగించడం ఇటీవల సాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
తమిళంలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాయి కిళవై సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వయసు మీద పడిన మహిళ పాత్రలో రాధికా అద్భుతంగా నటించడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కంటెంట్ ఆధారంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తూ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే దాదాపు 60 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని చిత్ర బృందం తెలిపింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని తాజాగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆమె మాట్లాడుతూ.. మా సినిమా 150 రూపాయల టికెట్ ధరతోనే దాదాపు 60 కోట్లు వసూలు చేసింది. అయితే కొంతమంది స్టార్ హీరోల సినిమాలకు టికెట్ ధరలు 1500 నుంచి 2000 రూపాయల వరకు ఉంటున్నాయి. మీరు సరిగ్గా లెక్కలు వేసుకుంటే, మేమే వారికంటే పెద్ద విజయం సాధించినట్టే అవుతుంది. అదే నిజమైన సక్సెస్ అంటూ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలను చాలా మంది స్టార్ హీరోల సినిమాలపై ఇన్‌డైరెక్ట్ కౌంటర్‌గా భావిస్తున్నారు. ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు వస్తున్నప్పటికీ టికెట్ ధరలు ఎక్కువగా ఉండటంపై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భంలో రాధికా మాటలు మరింత వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఆమె వ్యాఖ్యలపై పెద్ద చర్చ జరుగుతోంది. మంచి కథ, కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని, అధిక టికెట్ రేట్లు లేకుండానే పెద్ద విజయాలు సాధించవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా స్టార్ హీరోలు, నిర్మాతలు ప్రేక్షకుల గురించి ఆలోచించాలి అంటూ అభిప్రాయపడుతున్నారు.