Odisha : మద్యం మత్తులో, కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగ్రహంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. సొంత కుటుంబ సభ్యుల్నే హత్య చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని, దియోగర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. దీనిపై అందిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేష్ అనే వ్యక్తి తన భర్య, కొడుకు, కోడలు, మనవరాలితో ఉంటున్నాడు. అయితే, వీరి మధ్య కొంతకాలంగా విబేధాలు తలెత్తాయి.
చాలా కాలంగా కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి రమేష్ మద్యం తాగి ఇంటికొచ్చాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తలెత్తాయి. అప్పటికే మద్యం మత్తులో ఉన్న రమేష్ కోపోద్రిక్తుడయ్యాడు. ఇంట్లోని సుత్తి తీసుకుని కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. ముందుగా తన భార్యపై దాడి చేసి చంపేశాడు. అనంతరం కోడలిపై, చిన్నారి మనవరాలిపై కూడా సుత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో అతడి భార్య, కోడలు, మనవరాలు ముగ్గురూ రక్తపు మడుగులో పడి అక్కడే మరణించారు. ఈ ఘటన జరిగిన తర్వాత నిందితుడు రమేష్ అక్కడినుంచి పారిపోయాడు. ఈ సమయంలో అతడి కొడుకు ఇంట్లో లేడు. తర్వాత రాత్రి ఇంటికొచ్చి చూసేసరికి ముగ్గురు మృతదేహాల్ని చూసి షాకయ్యాడు. తర్వాత దీనిపై పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ప్రమాద స్థలానికి చేరుకుని ఆధారాలే సేకరించారు. కుటుంబ కలహాల వల్లే, మద్యం మత్తులో రమేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. నిందితుడు రమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటనపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.