రంగారెడ్డి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : బాటసింగారంలోని పండ్ల మార్కెట్కు ఆరంభంలోనే రికార్డు స్థాయిలో మామిడికాయలు వస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాలతోపాటు కృష్ణా, కడప జిల్లాల నుంచి మామిడికాయల లారీలు పోటెత్తుతున్నాయి.
శనివారం ఒక్క రోజే 300 ట్రక్కుల్లో సుమారు 7 వేల టన్నుల మామిడికాయలు రావడం విశేషం. సీజన్ ఆరంభంలోనే పెద్ద ఎత్తున మామిడికాయలు రావడంతో సీజన్ చివరి వరకు కనీసం 1.50 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందువల్ల విక్రయాలకు వచ్చే వ్యాపారులు, కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ మార్కెట్కు వస్తున్న మామిడికాయల్లో సుమారు 70 శాతం దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ర్టాలకు వెళ్తున్నాయి. మామిడి క్రయవిక్రయాలు రికార్డుస్థాయిలో జరుగుతుండడంతో మార్కెట్ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతున్నది.