నార్కట్పల్లి, జనవరి 31 : నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శివసత్తుల నాట్య విన్యాసాలు, ఆటపాటలు ఆకట్టుకున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చి అగ్నిగుండం నుంచి నడిచేందుకు పోటీపడ్డారు. ఆముదాలు, పత్తి, కందులు, మినుములు తదితర ధాన్యాలను రైతులు అగ్నిగుండంలో వేసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. మంగళవారం స్వామివారి ఏకాంత సేవ, పుష్పోత్సవం నిర్వహించనున్నట్లు దేవాదాయ సహాయక కమిషనర్ మహేంద్రకుమార్, ఆలయ ఇన్చార్జి ఈవో నవీన్ తెలిపారు.
యాదగిరిగుట్ట : పాతగుట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యులకు నిజాభిషేకం, విష్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వస్తివాచనం వంటి వైదృశ్య కార్యక్రమాలతో ఉత్సవాలకు మంగళవారం ఆలయ అర్చకులు, అధికారులు శ్రీకారం చుట్టారు. ఉదయం 9 గంటలకు స్వస్తివాచన ఘట్టాన్ని చేపట్టారు. సకల దేవకోటిని ఉత్సవాలకు విచ్చేసి సర్వలోకాలకు క్షేమాన్ని కలిగించాలని వేడుకోవడమే స్వస్తివాచనమని అర్చకులు తెలిపారు. మూలమంత్ర, భాగవత, రామాయణ, వేదప్రబంధ పారాయణాలు గావించారు. 33 కోట్ల దేవతలు, పద్నాలుగు లోకాలు, సమస్తప్రాణికోటి, చరాచర జగత్తు అంతా భగవానుడి కటాక్షంతో శుభాలు పొందాలని స్వస్తివాచన మంత్రాలతో విష్వక్సేన ఆరాధనతో ప్రార్థించారు. శ్రీవారికి, ఉత్సవ నిర్వాహకులకు రక్షాబంధనం కార్యక్రమాన్ని చేపట్టారు. పారాయణికులు, రుత్వికులకు ఆలయ ఈవో గీత దీక్షా వస్ర్తాలను అందజేశారు. కల్యాణ సంబురాలు, స్థల, ద్రవ్య శుద్ధ్యర్థం పూజించిన జలాలతో శుద్ధి పుణ్యాహవాచన కైంకర్యం చేపట్టారు. ఆలయ పరిసరాల శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. పంచామృత కలశాలకు వేదమంత్రాలతో దర్బలతో పూజలు నిర్వహించి పుణ్యజలంగా సంప్రోక్షణ జరిపారు. తిరువీధుల్లో వేదసూక్త మంత్ర పఠనాలతో తీర్థ ప్రోక్షణ చేశారు. సాయంత్రం 6 గంటలకు అంకురారోహణ, మృత్సంగ్రహణం వేడుకలను ఆగమ శాస్త్రరీతిలో చేపట్టారు. బుధవారం ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, వేదపారాయణం, సాయంత్రం 6 గంటలకు భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహించనున్నారు.
తాడ్వాయి : వనదేవతలు మేడారం సమ్మక్క, సారలమ్మ మినీ జాతరకు వేళయింది. నాలుగు రోజులపాటు జాతర కొనసాగనుండగా తల్లుల దర్శనానికి సుమారు 5లక్షల పైచిలుకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్యం, రోడ్లు తదితర సౌకర్యాల కోసం కలెక్టర్ రూ.2.82 కోట్లు మంజూరు చేయగా వివిధ శాఖల అధికారులు పనులు పూర్తి చేశారు.
బుధవారం గ్రామదేవతలు, బొడ్రాయిల వద్ద పూజలు చేస్తారు. అనంతరం దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా పూజారులు బురుకు కట్టెలతో గ్రామ పొలిమేరలో మామిడి ఆకులతో పాటు కోడిపిల్లను కట్టి తోరణాలు కడతారు. పూజారులతోపాటు వారి కుటుంబసభ్యులు, బంధువులు సమ్మక్క-సారలమ్మ పూజామందిరాల్లో పూజలు చేస్తారు. మినీజాతర ముగిసే దాకా అమ్మవార్లకు సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర క్రిష్ణయ్య, కన్నెపల్లిలో సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య పూజలు నిర్వహించనున్నారు. బుధవారం రాత్రి తల్లుల పూజారులు గద్దెల వద్ద జాగారం చేసి ఒకరిరొకరు సాకను ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతో మినీ జాతర ప్రారంభమవుతుంది.