మహిళా అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తున్నది. గర్భంలోని శిశువు నుంచి వృద్ధురాలి వరకు పలు పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు, రక్షణ కార్యక్రమాలపై భారీ ఎత్తున ప్రచారం నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 6 నుంచి 8 వరకు ‘మహిళా బంధు’ పేరిట ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నది. సంబురాలు అంబరాన్నంటేలా నిర్వహించాలన్న మంత్రి కేటీఆర్ పిలుపుతో టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా శ్రేణులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆదివారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళా పారిశుధ్య కార్మికులు, వైద్యారోగ్య సిబ్బంది, ఎస్‌హెచ్‌జీ సభ్యులకు సన్మానం, జయహో కేసీఆర్, థాంక్యూ కేసీఆర్ ఆకారం వచ్చేలా మానవహారాలు నిర్వహించనున్నారు. 7వ తేదీన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి స్వీట్లు పంపిణీ సెల్ఫీలు తీసుకోవడం, 8న నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలు, కేక్ కటింగ్‌లు, మహిళా ప్రజాప్రతినిధులకు సన్మానం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. శనివారం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో మంత్రి సబితారెడ్డి మహిళా కార్యకర్తలతో ‘మహిళా బంధు’ సన్నాహక సమావేశం నిర్వహించారు. వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘థాంక్యూ కేసీఆర్’ పోస్టర్లను ప్రదర్శించారు.
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, మార్చి 5 : తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది. ఏ పథకం తీసుకున్నా మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ, మహిళల అభ్యున్నతితోనే పూర్తిస్థాయిలో అభివృద్ది సాధ్యమనే విధంగా పథకాలు అమలు చేస్తున్నది. మహిళల కష్టాలు దూరం చేస్తూ, వారికి చిన్నప్పటి నుంచే సర్కారు తోడుగా నిలుస్తున్నది. కడుపులో ఉన్న శిశువు మొదలుకొని వృద్ధాప్యం వరకు అన్ని పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తుండడంతో ఏడేండ్లుగా మహిళాభ్యున్నతి కొనసాగుతున్నది.
ఈ నెల 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సంబురాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లలో అభివృద్ధి, సంక్షేమం, రక్షణకుగాను చేపట్టిన కార్యక్రమాలపై పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఈ నెల 6 నుంచి 8 వరకు సంబురాలను అంబరాన్నంటేలా నిర్వహించేందుకు టీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నది. 6న పారిశుధ్య కార్మికులు, వైద్యులు, ప్రతిభగల విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలను సన్మానించనున్నారు. జయహో కేసీఆర్, థ్యాంక్యూ కేసీఆర్ ఆకారం వచ్చేలా మానవహారం ఏర్పాటు చేయనున్నారు. 7న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కలువడంతోపాటు లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకోనున్నారు. మహిళా బంధు కేసీఆర్, థ్యాంక్యూ కేసీఆర్ పేరిట సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తారు. 8న మహిళా దినోత్సవం రోజున నియోజకవర్గ కేంద్రాల్లో సమావేశాలను నిర్వహించి, కేక్ కట్ చేసి మహిళా ప్రజాప్రతినిధులందరినీ సన్మానించనున్నారు.
తల్లి గర్భంలో ఉన్న శిశువు మొదలుకొని చివరి వరకు అనేక మహిళా పథకాలు అమలు జరుగుతున్నాయి. గర్భిణులకు చక్కటి పౌష్టికాహారం అందించడం ద్వారా పండంటి శిశువులు జన్మించేందుకు అవకాశం లభిస్తున్నది. సర్కారు దవాఖానల్లో ప్రసవాలు జరిగితే కేసీఆర్ కిట్లు అందజేస్తున్నది. దీనికితోడు ఆడపిల్ల పుడితే రూ.13వేలు ఇస్తున్నది. బాలికలను చదువుల్లో ప్రోత్సహించేందుకు గురుకులాలు నెలకొల్పిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. గురుకులాల్లో ఒక్కొక్కరిపై సంవత్సరానికి లక్షా 25వేల వరకు ఖర్చు చేసి విద్య అందిస్తున్నది. పేదింటి యువతుల వివాహం భారంగా పరిణమించిన ఈ రోజుల్లో వారి వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రూ.లక్షా116 అందజేస్తున్నారు.
ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులకు తాము ఉన్నామనే భరోసా కల్పిస్తూ ప్రతి నెలా ఠంచనుగా రూ.2016 పింఛన్ అందజేస్తున్నది. బీడీ కార్మికులకు కూడా పింఛన్ అందజేస్తున్నది. పథకాలతో మహిళల్లో మనోధైర్యం ఏర్పడింది. గౌరవాన్ని పొందుతున్నారు. నీటి కష్టాలకు చెక్ పెడుతూ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించే కార్యక్రమం చేపట్టడంతో మహిళలు సంతోషంగా ఉన్నారు. వారితోపాటు మహిళా ఉద్యోగుల కష్టాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ వారికి వేతనాల పెంపుతో వారి కుటుంబాల్లో సంతోషం నింపారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఆశవర్కర్ల వేతనాలు పెంచడం ద్వారా వారి జీవితంలో వెలుగులు నింపారు. ఆకతాయిల నుంచి రక్షణకు షీటీంలను ఏర్పాటు చేయడం, మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందేలా పెద్దఎత్తున రుణాలను మంజూరు చేయడం వంటి కార్యక్రమాలను టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. ఇవేకాకుండా మరిన్ని మహిళాభ్యున్నతి కార్యక్రమాలు అమలు చేస్తూ మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలో మూడు రోజులపాటు వేడుకలను నిర్వహించనున్నాం. మహిళా ప్రజాప్రతినిధులతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులను సన్మానించనున్నాం. ఏడేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం, అభివృద్ధి, రక్షణ కోసం అమలుచేస్తున్న పథకాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం
నిర్వహించేందుకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చాం.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులపాటు మహిళా సంబురాలు నిర్వహిస్తాం. 6న పారిశుధ్య కార్మికులు, స్వయం సహాయక సంఘాల మహిళలను సన్మానించడం, 7న సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కలువడం, 8న నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో మహిళా దినోత్సవ సమావేశాలు నిర్వహిస్తాం. మహిళల సంక్షేమానికి తెలంగాణలో అమలు జరుగుతున్న అనేక పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.