బడంగ్‌పేట, ఏప్రిల్ 11 : ‘బీఆర్ఎస్ అంటేనే ప్రజలకు భరోసానిచ్చే పార్టీ.. సబ్బండ వర్ణాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది.. బీజేపీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి..’ అని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. మంగళవారం మహేశ్వరం మండలంలోని మన్సాన్పల్లిలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి హాజరై మాట్లాడారు. మనది రైతు ప్రభుత్వమని, రైతన్నల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు. మన పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో అమలవుతున్నాయో చెప్పాలని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రజల మీద ప్రేమ ఉంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రం సుభిక్షంగా మారిందన్నారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా రైతులకు అన్ని విధాలుగా భరోసా కల్పిస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. మంగళవారం మహేశ్వరం మండల పరిధిలోని మన్సాన్పల్లిలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. భారీ ఊరేగింపుగా ఆత్మీయ సమ్మేళనం ప్రాంగణానికి మంత్రి, జడ్పీ చైర్పర్సన్, మాజీ ఎమ్మెల్యేలను గులాబీ పూలతో ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రైతుల కోసం సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా పథకం ప్రవేశపెట్టి రైతుల కన్నీరు తుడుస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన విత్తనాలు, మందుల కొరత లేకుండా చూస్తున్నారని తెలిపారు. రైతుకు ఏదైనా ప్రమాదం జరిగితే రైతు కుటుంబానికి రూ.ఐదు లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఈ పథకం ఉందో బీజేపీ నాయకులు చెప్పాలన్నారు.
రోడ్లు, డ్రైనేజీ వేసినా, మంచినీళ్లు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్నారని బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. బీజేపీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలపై ఏమాత్రం అభిమానం ఉన్నా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలన్నారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రాష్ట్రం అన్ని రంగాల్లో సస్యశామలంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఉద్యోగాలను ఇస్తుంటే ఓర్వలేని బీజేపీ నాయకులు వాటిని అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు. చివరకు పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాలను లీకేజీ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజలు మంచి చెడులను గమనిస్తున్నారన్నారు.
సంక్షేమానికి పెద్దపీట
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని మంత్రి సబితారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు కావడం లేదో బీజేపీ నాయకులను ప్రజలు ప్రశ్నించాలన్నారు. గర్భిణులకు కేసీఆర్ కిట్లను అందజేసి, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డకు రూ.12 వేలను అందజేస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఒక పెద్ద మనస్సుతో తల్లి పాత్రను పోషిస్తున్నారని ఆమె కొనియాడారు. కల్యాణలక్ష్మి, వృద్ధాప్య పింఛన్లను అందజేసి ఒక మేనమామగా వ్యహరిస్తున్నారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులలో పూడిక తీయడం ద్వారా చెరువుల్లోకి నీళ్లు రావడంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. మరోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి కార్యకర్తలు కంకణబద్దులై పనిచేయాలని మంత్రి సబితారెడ్డి స్పష్టం చేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజునాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరిగౌడ్, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు చంద్రయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేశ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ ఆదిల్‌అలీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటలు ప్రజలు నమ్మొద్దు : మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి
అధికారంలోకి రావడానికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్తున్న అబద్ధపు ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మహిళల పాత్ర ఎంతో ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు ఏం చేశాయో ప్రశ్నించాలన్నారు. వారిని ప్రజలెవరూ నమ్మడం లేదన్నారు. దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండడానికి ముఖ్యమంత్రి కేసీఆరే కారణమని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విషం గక్కుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రతిఒక్కరూ రాజకీయాలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మద్దతు తెలిపి దేశ రాజకీయాలను శాసించేలా ప్రతి ఒక్కరం సహకారం అందించాలని ఆయన కోరారు.
మతం, కులం పేరుతో బీజేపీ రాజకీయాలు : జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి
బీజేపీ నాయకులు మతం, కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు కుళ్ల్లు కుతంత్రాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే అభివృద్ధి జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. చెరువులను అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని తెలిపారు. ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. బీజేపీ ఏం చేసిందో ప్రజలకు చెప్పాలన్నారు. అభివృద్ధికి ఆటంకంగా మారారని ఆమె మండిపడ్డారు.