పరిగి, మార్చి 8: మహాశివరాత్రి సందర్భంగా పరిగి పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం, బ్రాహ్మణవాడ శివాలయం, పట్టణంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పరిగి మార్కెట్‌యార్డులో మహా రుద్రాభిషేకం కార్య క్రమం నిర్వహించారు. బ్రాహ్మణవాడ శివాలయంలో ఎమ్మెల్యే రామ్మో హన్‌రెడ్డి-ఉమాదేవి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జున స్వామి ఆలయం వద్ద స్వామి వారి దర్శనం అనంతరం భక్తులకు ఆలయ కమిటీ వారు ప్రసాద వితరణ చేశారు.
వికారాబాద్: వికారాబాద్ పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వరాలయం, మల్లికార్జునస్వామి ఆలయం, శివాలయంతో పాటు మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామ శివారులోని పార్వతీ పరమేశ్వరుడి ఆలయం, మదన్‌పల్లి సమీపంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామ స్మరణతో ఆలయాల పరిసరాలు మార్మోగాయి. ఆయా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
తాండూరు/తాండూరు రూరల్: నియోజకవర్గంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. అంతారం తండాలోని శ్రీభూకైలాస్ ఆలయం, బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలోని ఏకాంబరి, జీవన్గి, పెద్దేముల్ మండలం తట్టెపల్లి సమీపంలోని అంబురామేశ్వర ఆలయం, యాలాల మండలం సంగెంకుర్ధులోని సంగమేశ్వరఆలయంతో పాటు తాండూరు మున్సిపల్ పరిధిలోని శ్రీభావిగి భద్రేశ్వర ఆలయం, చెరువెంటి ఈశ్వరాలయం, అంతప్పబావి శివాలయం, కోటేశ్వర ఆలయంతో పాటు పలు శివాలయాల్లో శివుడికి భక్తి శ్రద్ధలతో భక్తులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, జలాభిషేకం, పాలాభిషేకం, రుద్రాభిషేకం, అర్చనలు చేశారు.
ఉపవాక్ష దీక్షలు విరమించడానికి భక్తులు శివుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. హర హర మహాదేవా… శంబో శంకర…అంటూ భక్తుల శివనామస్మరణతో తాండూరు నియోజక వర్గంలోని శివాలయాలు మార్మోగాయి. బ్రహ్మకుమారి సమాజం తాం డూరు శాఖ కేంద్రంలో ఇన్చార్జి జగదేవి ఆధ్వర్యంలో మహా శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే బుయ్యని మనోహార్‌రెడ్డి భూకైలాస్‌లో ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన మహిళలు భవానీ మాతకు బోనమెత్తి భక్తిని చాటుకున్నారు.
కొడంగల్: కొడంగల్, దౌల్తాబాద్ మండలాలోని శైవక్షేత్రాలు ప్రత్యేక పూజలతో శివనామ స్మరణ మార్మోగింది. పట్టణంలోని మహాదేవుని, గాడిబావి శివాలయాల్లో ఉదయం నుంచి భక్తులు బారులు తీరి శివలింగానికి పంచామృతాభిశేకం, బిల్వార్చన, అష్టోత్తర శతనామావళి, రుద్రాభిశేకం తదితర పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు కృష్ణజోషి ఆధ్వర్యంలో జరిగాయి. పట్టణ శివారులోని గాడిబావి శివాలయంలో శివుడిని దర్శించుకొని ఉపవాస దీక్షను విరమించేందుకు భక్తులు బారులు తీరారు.
బొంరాస్‌పేట: బొంరాస్‌పేట, దుద్యాల మండలాల్లో ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. బొంరాస్‌పేట సమీపంలోని శ్రీసంగమేశ్వర దేవా లయం, నాగిరెడ్డిపల్లి సమీపంలోని శ్రీపరమేశ్వర దేవాలయానికి మండలంలోని భక్తులే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. భక్తులు మారేడు దళాలు, మోదుగ పూలతో పూజించి అభిషేకాలు చేశారు. పండ్లు నైవేద్యంగా సమర్పించారు. గౌరారం, దేవులానాయక్తండా, మెట్లకుంట, రేగడిమైలారం గ్రామాల్లోని శివాలయాలలో భక్తులు శివుడికి పూజలు చేశారు. దేవాలయాలలో రాత్రంతా భజనలు చేసి జాగారం చేశారు.
కులకచర్ల : మండలంలోని పలు గ్రామాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే ఆలయాలు భక్తుల తో కిట కిటలాడాయి. మండలంలోని పాంబండ రామలింగేశ్వరాలయం జనసంద్రంగా మారింది. వందల సంఖ్యలో భక్తులు తరలివచ్చి పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉపవాసం ఉన్న భక్తులు రాత్రి వేళ అక్కడే నిద్రించి దీక్షలను విరమిస్తారు. దీంతో భక్తుల భద్రత కోసం పోలీసులు ఏర్పాట్లు చేశారు.
ఆలయ కమిటీ చైర్మన్ నర్సమ్మారాములు, ఈవో సుధాకర్ భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. చౌడాపూర్ మండలంలోని మందిపల్ గ్రామంలో హోంకారేశ్వరాలయంలో శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు రాజశేఖర్ ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
దోమ : మండల పరిధిలోని ఊటుపల్లి గ్రామంలో మహా శివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకొని పార్వతీ పరమేశ్వరుల పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేపట్టిన శివ భక్తులు గ్రామంలోని వీధుల గుండా పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా శివనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మామిళ్ల నర్సిములు, జంగయ్య, గోపాల్, నాగార్జున్, రాజేశ్‌రెడ్డి, మలేశ్ తదితరులు పాల్గొన్నారు.
మర్పల్లి : మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం ఉపవాస దీక్షలు విరమించారు. మర్పల్లి ఆలయంలో ఆర్ఎస్ఎస్-ఎస్హెచ్డీఎస్, శంభాజీ మహరాజ్ యూత్ అధ్వర్యంలో భక్తులకు పండ్లు పంపిణీ చేశారు.