మియాపూర్ , డిసెంబరు 18 : కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అనర్హత వేటు నుంచి తప్పించుకుని అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమాన పరిచారని వివేకానందనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు అన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరకుంటే నిజంగానే బీఆర్ఎస్లో ఉంటే ఈనెల 21 వ తేదీన బీఆర్ఎస్ భవన్లో నిర్వహించే పార్టీ సమావేశానికి హాజరుకావాలని డిమాండ్ చేసారు. ఈమేరకు గాంధీ సహా ఇతర ఎమ్మెల్యేలు పార్టీ మారి అందులోనే కొనసాగుతున్నామని అబద్ధాలు చెప్పటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వివేకానందనగర్ డివిజన్లోని ఆర్పీ కాలనీలో అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు.
తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించి అనంతరం పార్టీ మారిన ఎమ్మెల్యేలు, స్పీకర్ వైఖరికి నిరసనగా అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా రంగారావు మాట్లాడుతూ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నట్లు స్వయంగా ప్రకటించి అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు స్పీకర్‌పై వత్తిడి తెచ్చి ఆధారాలు లేవని చెప్పించటం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే గాంధీ ఈ నెల 21 వ తేదీన తెలంగాణ భవన్లో నిర్వహింనున్న సమావేశానికి హాజరుకావాలని ఆయన డిమాండ్ చేసారు.
లేని పక్షంలో గాంధీ తక్షణమే రాజీనామా చేసి కాంగ్రెస్ నుంచి గెలవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పెద్ద భాస్కర్‌రావు, మాచర్ల భద్రయ్య, ఆంజనేయులు, జగదీష్ గౌడ్, ప్రవీణ్,, విక్రమ్, మధు, యశ్వంత్, రవీందర్రావు, సత్యనారాయణ, రవి, పర్వతాలు, సతీష్‌కుమార్, రామ్‌చందర్, కొండల్రావు, విద్యాసాగర్,జై మల్లయ్య, శ్రీనివాస్, రాజశేఖర్, నరేష్, రమేష్‌రావు, వెంకన్న, జగదీష్, రామారావు, కేవీరావు, సాయి, సంతోష్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.