ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకునే దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తక్షణమే ఎన్వోసీలు ఇవ్వాలని, తద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం ఆదేశాలిస్తుండగా, మరోవైపు క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారులకు తిప్పలు తప్పడం లేదు. పలు వెంచర్లలో రూ.వెయ్యి చెల్లించి పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్లాట్ల యజమానులకు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో జిల్లావ్యాప్తంగా వేలాదిమంది తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు వీలు కల్పించారు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో 21 మండలాలు, 13 మున్సిపాలిటీలు ఉన్నాయి.
ఇందులో అన్ని మున్సిపాలిటీలు కూడా హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్నాయి. 11 మండలాలు కూడా హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్నాయి. దీంతో ఆయా వెంచర్లలో రిజిస్ట్రేషన్ కాకుండా మిగిలిపోయిన వెంచర్లకు రూ.వెయ్యి చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ అవకాశం మేరకు జిల్లావ్యాప్తంగా వేలాది మంది ప్లాట్ల యజమానులు తమ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకుని ఇల్లు నిర్మించుకోవడంతో పాటు రుణాలు తీసుకోవడం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తును పరిశీలించి తద్వారా వాటిని రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
– రంగారెడ్డి, జనవరి 25 (నమస్తే తెలంగాణ)
హెచ్ఎండీఏ పరిధిలో ఎల్ఆర్ఎస్ కాని ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా మున్సిపాలిటీల్లో వెయ్యి రూపాయలు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు స్థానిక మున్సిపాలిటీలు, మండలాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులను పరిశీలించడం కోసం మున్సిపాలిటీల్లోని టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, మున్సిపాలిటీల్లో టౌన్‌ప్లానింగ్ అధికారుల కొరత తీవ్ర తలనొప్పిగా మారింది.
ముందుగా టౌన్‌ప్లానింగ్ అధికారులు ప్లాటు వద్దకు వెళ్లి లొకేషన్ చూసిన తర్వాత ప్లాట్ సమీపంలో చెరువులు లేవని ఇంటి నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేదని రెవెన్యూ యాప్‌లోకి అప్లోడ్ చేస్తారు. ఆ తర్వాత ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూడా ప్లాటు ప్రాంతాన్ని సందర్శించి అనుమతులివ్వాల్సి ఉంటుంది. కాని, ఈ శాఖల మధ్య సమన్వయ లోపంతో ఎల్వోసీలు జారీ చేయడానికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఎలాంటి నీటి వనరులకు దగ్గరలో లేకపోయినా ప్లాట్ల విషయంలో కూడా ఎన్వోసీ ఇవ్వడానికి ఈ మూడు శాఖల అనుమతులు తప్పని సరి కావడం వల్ల ప్లాట్ల యజమానులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్లాట్లకు, ఇండ్ల నిర్మాణానికి ఎన్వోసీలు ఇచ్చే విషయంలో శాఖల మధ్య సమన్వయ లోపం దరఖాస్తుదారులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఇరిగేషన్ ఏఈ, రెవెన్యూ శాఖ ఆర్ఐలు, మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్ అధికారులకు ఎన్వోసీలకు అనుమతి బాధ్యతలు అప్పగించింది. కానీ, ఆయా శాఖల అధికారులు వివిధ పనుల్లో తలమునకలై ఉన్నందున ఈ అనుమతుల విషయంలో శ్రద్ధ చూపడం లేదు. దరఖాస్తు దారులు మూడు శాఖల అధికారుల వద్దకు తిరిగి వారిని కలువడానికే సుమారు నెల రోజులు పడుతున్నది. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడం వల్ల చేతులు తడపక తప్పడం లేదని ఆరోపణలున్నాయి.
జిల్లాలో అత్యధిక శాతం మండలాలు, మున్సిపాలిటీలు హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్నాయి. నగర శివారుల్లో విస్తరించి ఉన్న రంగారెడ్డి జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లు, సుమారు 11 మండలాలు హెచ్ఎండీఏ పరిధిలో ఉన్నాయి. ఈ మండలాల్లో ఎల్ఆర్ఎస్ లేకుండా అనేక ప్లాట్లు ఉన్నాయి. ఈ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవడం కోసం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, ఎన్వోసీల అనుమతి విషయంలో మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు విచారించిన తర్వాతనే అనుమతులు తప్పని సరి చేసింది. ఈ నేపథ్యంలో ఆయా అధికారులు సకాలంలో స్పందించకపోవడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమన్వయ లోపంతో ఎన్వోసీలు సకాలంలో జారీ కావడం లేదు. నెలల తరబడి ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నా పనులు కావడం లేదు. ప్లాట్లను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా కిందిస్థాయి అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు.
– మూర్తి జంగారెడ్డి, రాయపోల్