హయత్‌నగర్, నవంబర్ 2 : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హయత్‌నగర్ డివిజన్లోని పలుచోట్ల దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. చిన్నపాటి వర్షాలకు రోడ్లన్నీ బురదమయంగా మారి వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. హయత్‌నగర్‌లోని కుమ్మరికుంట కట్ట పైనుండి హయత్‌నగర్ నుండి బీఎన్‌రెడ్డినగర్ వరకు ప్రతిరోజూ వేలాది వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇదే రోడ్డులో దాదాపు 20 నుండి 25 కాలనీలకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతోపాటు హయత్‌నగర్ నుండి ఇంజాపూర్కు వెళ్లాల్సిన రోడ్డు జైస్వాల్ ఫర్నీచర్ సమీపంలో భారీగా గుంతలు పడి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.
గత కొన్ని నెలలుగా రోడ్లపై గుంతలు ఏర్పడి వాహనదారులు అవస్థలకు గురవుతున్నా సంబంధిత అధికారులు గానీ, స్థానిక ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకున్న పాపాన పోవడం లేదని స్థానికులు, వాహనదారులు మండుపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చివేసి వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.