వికారాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : జిల్లా కాంగ్రెస్ పార్టీలో స్థానిక ఎన్నికల పంచాయితీ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవడం అసాధ్యమని గుర్తిస్తున్న కొందరు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతుంటే, మరికొందరు నాయకులు స్థానిక సంస్థల పదవుల విషయంలో తమకే మద్దతివ్వాలని ఒత్తిడి తీసుకువస్తుండడంతో జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది.
ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు ఎవరికి వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఆశావహులు తమకే మద్దతు ఇవ్వాలని కోరుతుండడంతో.. ఎవరికి మద్దతిస్తే పార్టీలో ఎలాంటి పరిస్థితులుంటాయోననే అభిప్రాయంతో ఎమ్మెల్యేలు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కొందరు ఆశావహులు స్థానిక ఎమ్మెల్యేలను కాదని నేరుగా కాంగ్రెస్ పెద్దలను కలుస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది.
మరికొందరు స్థానిక ఎమ్మెల్యేలతో పదవుల విషయమై ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తుండడం గమనార్హం. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి సంబంధించి ప్రధానంగా తాండూరు ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాస్‌రెడ్డితోపాటు వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన రఘువీరారెడ్డి పేరు వినిపిస్తున్నది. స్పీకర్ ప్రసాద్‌కుమార్ తన కూతురుని కూడా బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కూడా తన సతీమణిని బరిలో దింపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
మరోవైపు బీఆర్ఎస్ తరపున వరుసగా మూడుసార్లు జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి సతీమణి పట్నం సునీతారెడ్డి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీ వారి కుటుంబసభ్యులనే బరిలోకి దింపాలనే ప్రయత్నాలు చేస్తుండడంతో ఎమ్మెల్యేలకు సంబంధంలేని ఆశావహులు కాంగ్రెస్ పెద్దలతో టచ్‌లో ఉంటూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తున్నది.
కాంగ్రెస్‌ను వీడుతున్న మరికొందరు నాయకులు
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించడంతో కాంగ్రెస్‌కు ఆ పార్టీ నాయకులు షాకిస్తున్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీలో ఇతర పార్టీలో నుంచి చేరికలు సహజం. కానీ జిల్లాలో మాత్రం అధికార పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరుతుండటం గమనార్హం. ఓ వైపు ప్రజల్లో ఉన్న అసంతృప్తి.. మరోవైపు సొంత పార్టీ నాయకులు, శ్రేణులు పార్టీని వీడుతుండడంతో హస్తం పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు తలనొప్పిగా మారింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సబ్బండ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసింది.
ఈ ఏడాది రైతు బంధు ఎగ్గొట్టడం, పింఛన్ల పెంపు లేదు, ఇందిరమ్మ ఇండ్లకు అందని ఆర్థిక సాయం, నెలలపాటు రైతు బీమా కోసం ఎదురుచూపులు, ఉద్యోగులకు అందని జీతాలు, గ్రామాలకు రూపాయి నిధులివ్వకపోవడం-పాలన స్తంభించడం, పల్లెలన్నీ సమస్యలతో సతమతమవుతుండడంతో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలోనూ, పంటకు వేసే ఎరువులను కూడా సరిపడినంత అందుబాటులో ఉంచకుండా కాంగ్రెస్ సర్కారు రైతులకు అన్యాయం చేసింది.
జిల్లాలోని ఒకట్రెండు ఎకరాలున్న పేద రైతుల భూముల నుంచి రీజినల్ రింగ్‌రోడ్డు వెళ్లేలా అలైన్మెంట్ మార్చడం కూడా కాంగ్రెస్ పార్టీపై జిల్లా ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్‌ను వదలి బీఆర్ఎస్లో చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల గెలుపునకు కష్టపడిన వారంతా ఒక్కొక్కరిగా గులాబీ కండువా కప్పుకొంటున్నారు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాల్లోని పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గత ఒకట్రెండు నెలలుగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తేనే గెలుస్తామని గుర్తించిన నాయకులు కారెక్కుతుండటం గమనార్హం.
మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు
జడ్పీ చైర్మన్ పదవి కోసం ఆశావహులు స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పెద్దల మద్దతును కూడగట్టేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే సోదరుడు శ్రీనివాస్‌రెడ్డి ప్రయత్నాల్లో ముందున్నట్లు ప్రచారం జరుగుతున్నది. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డితోపాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలందరితో పలుమార్లు సమావేశమై తనకే మద్దతివ్వాలని కోరినట్లు తెలిసింది. ఓ కీలక మంత్రితో శ్రీనివాస్‌రెడ్డికి సత్సంబంధాలు ఉండటంతో అటు వైపు నుంచి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
వికారాబాద్ నియోజకవర్గం ధారూరు మండలానికి చెందిన రఘువీరారెడ్డికి ఎమ్మెల్యే, స్పీకర్ ప్రసాద్‌కుమార్ నుంచి ఎలాంటి మద్దతు లేకపోవడంతో సైలెంట్‌గా సీఎంకు సన్నిహితంగా ఉండే నాయకులతో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలోనే స్పీకర్‌కు తెలియకుండానే పీసీసీ కార్యదర్శి పదవిని తెచ్చుకున్న రఘువీరారెడ్డి, ప్రస్తుతం కూడా అదేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
స్పీకర్ ప్రసాద్‌కుమార్-రఘువీరారెడ్డి మధ్య వైరం నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ప్రసాద్‌కుమార్ స్పీకర్ అయిన తర్వాత ధారూరు మండలానికి ఏ కార్యక్రమానికి వెళ్లినా రఘువీరారెడ్డి పాల్గొనకపోవడం గమనార్హం. ఇటీవల పీసీసీ నుంచి ఆశావాహుల వివరాల సేకరణ కార్యక్రమం నిర్వహించగా స్పీకర్‌కు పోటీగా తన అనుచరులతో ధర్నా చేయించినట్లు ప్రచారం జరుగుతున్నది. గతంలోనూ స్థానిక ఎమ్మెల్యే, స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను పలుమార్లు కలిసేందుకు వెళ్లినా, పదవి కోసం లెటర్ ఇవ్వాలని కోరినా స్పీకర్ స్పందించపోవడంతోనే స్పీకర్‌కు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వీరిద్దరిలో ఒకరికి మద్దతిస్తారా లేదా వారి కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నాలు చేస్తారా అనేది త్వరలో తేలనున్నది.