కొత్తూరు, ఆగస్టు 23 : సారూ.. మాకెప్పుడవుతుంది రుణమాఫీ అంటూ రైతులు కొత్తూరు మండల వ్యవసాయ కార్యాయలం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తూరు మండలంలో సగానికి పైగా రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో పాస్‌పుస్తకాలు, బ్యాంకు బుక్కులు పట్టుకుని మండల వ్యవసాయ అధికారి చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం ఏ నిబంధనలు లేవు అందరికీ మాఫీ అవుతుందని చెప్పిన మాటలు నీటి మూటలేనా అంటూ వాపోతున్నారు. ఏవేవో కారణాలు చెప్పి రుణమాఫీ నుంచి తమను తప్పిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇలా చాలామంది మాఫీ అర్హత కోల్పోయేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధలను మార్చిందని రైతులు మండిపడుతున్నారు. మూడు విడుతల్లోనూ ఎంతో మంది రైతులకు మాఫీ కాలేదు. మండలంలోని రెడ్డిపాలెంలో రుణం తీసుకున్న రైతులు 110 మంది ఉంటే వారిలో కేవలం 15 మందికే పంట రుణం మాఫీ అయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన తీరును అర్ధం చేసుకోవచ్చని మండలవాసులు పెదవి విరుస్తున్నారు.
కొత్తూరు మండలంలోని రెడ్డిపాలెంలో 110 మంది రైతులు లోన్ తీసుకుంటే కేవలం 15 మందికే మాఫీ అయింది. గూడూరు గ్రామ పంచాయతీకి ఆమ్లెట్ విలేజ్‌గా రెడ్డిపాలెం ఉన్నది. రెండు సార్లు సర్పంచ్‌గా, ఒక సారి ఎంపీటీసీగా పని చేశా. నేను సామాన్య రైతునే అయినా రుణమాఫీ కాలేదు. మా గ్రామంలో కేవలం 15 మందికి మాత్రమే రుణమాఫీ అయింది అంటే రాష్ట్రం మొత్తం పరిస్థితి ఎంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలి. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలె.
– తిరుమల్‌రెడ్డి రాయపురెడ్డి, రెడ్డిపాలెం, గూడూరు మాజీ సర్పంచ్
మా కుటుంబంలో నేను, మా నాన్న, మా అబ్బాయి కలిసి బ్యాంకులో రూ. 4 లక్షల వరకు అప్పు తీసుకున్నాం. మా కుటుంబంలో ఎవరికైనా సరే రూ. 2 లక్షల రుణ మాఫీ అవుతదనుకున్నా. కానీ ఎవరికీ మాఫీ కాలె. ఇదెక్కడి అన్యాయమంటూ బ్యాంకు, వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లా. మీరంతా ఒకే కుటుంబం వారంటూ ఏవేవో సాకులు చెప్పిండ్రు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఓటు వేసి ఎంత మోసపోయినమో అర్థమైంది. మా కుటుంబ సభ్యులందరికీ రుణమాఫీ చేయాలె. ఎవరిదివారమే ఎవుసం చేసుకుంటున్నాం. మాకెందుకు మాఫీ చేయరు. సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పడమే కాని ఆచరించరా.. ఇదేమి ప్రభుత్వం.. ఇదివరకెప్పుడు మాకు ఇలా కాలె. కేసీఆర్ ఉన్నప్పుడు అందరికీ న్యాయం జరిగింది.
– రవీందర్‌రెడ్డి, సిద్దాపూర్, కొత్తూరు మండలం
నేను రూ. 2 లక్షల రుణం తీసుకున్నా. వడ్డీతో ఎక్కువైంది. పైన పైసలు కడితేనే అర్హుడవు అని బ్యాంకు వాళ్లు చెప్పిండ్రు. అప్పుడెమో ఎంత రుణం ఉన్నా రూ. 2లక్షల వరకు మాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పిండు. ఇప్పడేమో నానా ఇబ్బందులు పెడుతున్నాడు. రుణమాఫీ కొందరికేనా అందరికి చేస్తరో అర్థం కావడం లేదు. ఇలా చేస్తే కాంగ్రెస్‌కు రాబోవు రోజుల్లో గుణపాఠం తప్పదు.
– ఎల్లయ్య, ఎస్బీపల్లి, కొత్తూరు మండలం
నేను యూనియన్ బ్యాంకులో రూ. 80 వేలు తీసుకున్నా. రెండో విడుతలో రుణమాఫీ అవుతదనుకున్నా. బ్యాంకుకు, వ్యవసాయ అధికారి వద్దకు వెళ్లినా.. అన్ని కరెక్టు ఉన్నయంటున్నారు కానీ మాఫీ ఎందుకు కాలేదో చెబుతలేరు. మూడో విడుతలనన్న అయితదనుకున్నా.. అయినా కాలె. కాంగ్రెస్ సర్కారు అందరికీ మాఫీ చేయదా.. అని అడిగితే వాళ్లు సమాధానం చెప్తలేరు. ఇప్పటికైనా రైతులందరికీ రుణమాఫీ చేయాలె. కాంగ్రెస్ సర్కార్ రైతులపై కపట బుద్ధి చూపించవద్దని కోరుకుంటున్నా.
– కోట రామచంద్రయ్య, పెంజర్ల
నేను రూ. 40 వేలు క్రాప్‌లోన్ తీసుకున్నా. రూ. 2 లక్షల వరకు మాఫీ అంటే ఎంతో సంతోషపడినా. మొదటి విడుతలోనే నా అప్పు పోతదనుకున్నా. కానీ మూడు విడుతలు దాటినా కూడా మాఫీ కాలె. ఇగ రోజూ బ్యాంకు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్నా. కాంగ్రెస్ సర్కార్ ఈ అబద్ధపు మాటలు ఎందుకు చెప్పాలె. రైతులను నమ్మించి మోసం ఎందుకు చెయాలె. రైతుల ఉసురు తగులుతది. ఇప్పటికైనా రైతులందరికీ రుణమాఫీ చేయాలె.
– కృష్ణ, కొడిచెర్ల