మొయినాబాద్, జూలై 13 : మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హిమాయత్‌నగర్ రెవెన్యూలోని భూములు గండిపేట జలాశయానికి ఆనుకుని ఉంటాయి. హిమాయత్‌నగర్ గ్రామానికి చెందిన కొందరి రైతుల భూములు ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లలో ఉండటంతోపాటు రెండింటిలో ఉండని భూముల్లో సాగు చేసుకోవడానికి బోర్లు వేశారు. వ్యవసాయం మానేసి పెద్దపెద్ద నీటి గుంతలు ఏర్పాటు చేసి బోర్ల నుంచి నీటిని తోడి నీటి గుంతల్లో నిలువ చేస్తున్నారు.
హిమాయత్‌నగర్ నుంచి గండిపేట వెళ్లడానికి రోడ్డు ఉన్నది. ఆ దారి పక్కనే ఆరుగురు రైతులు నీటి వ్యాపారం యథేచ్చగా చేస్తున్నారు. నగరానికి చెందిన కొందరు నీటి వ్యాపారులు రైతులకు నెలకు కొంత చెల్లించి నీటిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాలను విక్రయించరాదని తెలిసినా తమనెవరూ ఏమీ చేయలేరని.. వచ్చిన అధికారులకు కొంత ముట్టజెపితే వెళ్లిపోతారనే ధోరణిలో దర్జాగా నీటిని అమ్ముకుంటున్నారు.
నిత్యం లక్షల్లో నీటి వ్యాపారం
గచ్చిబౌలి, కోకాపేట, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, పుప్పాల్‌గూడ, మణికొండ, మంచిరేవుల, నార్సింగి, నానక్రాగూడ, గండిపేట తదితర ప్రాంతాల అపార్ట్మెంట్లకు అక్రమార్కులు నీటిని తరలించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజూ ఒక్కో ట్యాంకర్ వ్యాపారి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తున్నారు. యథేచ్చగా భూగర్భ జలాలను తోడేస్తుంటే గండిపేట జలాశయాన్ని పరిరక్షించే జలమండలి అధికారులు కాని, వాల్టా చట్టాన్ని అమలు చేసే రెవెన్యూ శాఖ అధికారులెవరూ పట్టించుకోవడంతో దర్జాగా వ్యాపారం సాగుతున్నది.
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
చట్టాన్ని ఉల్లంఘించి నీటి వ్యాపారం చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. గతంలో మా దృష్టికి వస్తే గండిపేట జలాశయం పక్కన మూడు బోర్లను సీజ్ చేశాం. అదేవిధంగా మూడు ట్యాంకర్లపై కేసులు కూడా పెట్టాం. జలాశయం పక్కన ఉన్న వ్యవసాయ బోర్ల ద్వారా మంచినీటిని తోడేస్తూ విక్రయిస్తున్నారని జలమండలి అధికారులకు కూడా చెప్పాం. మళ్లీ నీటి వ్యాపారం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటివారైనా వదిలిపెట్టం.
– గౌతంకుమార్, తహసీల్దార్, మొయినాబాద్