రంగారెడ్డి, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ల విలువ పెంపుపై సర్కారు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రజల నుంచి వ్యతిరేకత తీవ్రమవుతున్న నేపథ్యంలో భూముల రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ విలువ పెంపుపై ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలకే సర్కారుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
రైతు భరోసా ద్వారా వ్యతిరేకతను తగ్గించడానికి ప్రయత్నించినప్పటికీ పూర్తిస్థాయిలో రైతులందరికీ రైతు భరోసా వేయకపోగా, రుణమాఫీ కూడా అందరికీ జరుగలేదు. ప్రభుత్వ ఆదాయాన్ని భారీగా పెంచుకోవడం కోసం రిజిస్ట్రేషన్ల విలువలు పెంచాలని సర్కారు నిర్ణయించింది. కాని, స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల్లో జరపాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల విలువలు పెంచే విషయాన్ని ప్రభుత్వం వాయిదా వేసుకుంది.
భూముల రిజిస్ట్రేషన్లను భారీగా పెంచి స్టాంప్ డ్యూటీని తగ్గించాలనే నిర్ణయంతో రంగారెడ్డి జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా సర్కారుకు భారీగా ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుతమున్న భూముల రిజిస్ట్రేషన్ విలువ 7.6 శాతాన్ని సుమారు 30 శాతానికి పెంచేందుకు అన్ని రకాల కసరత్తులు చేసింది. దీంతో కొనుగోలుదారుల మరింత భారం భరించాల్సివస్తుంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో కుదేలైన రంగారెడ్డిజిల్లా మరింత వెనుకబడే పరిస్థితి నెలకొన్నది.