రంగారెడ్డి, మే 24 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఆదాయాన్ని సమకూర్చే మార్గాలపై హెచ్ఎండీఏ అన్వేషణ మొదలైంది. ఇందుకోసం మరిన్ని లేఅవుట్లు చేయాలని.. తద్వారా రాబడిని పెంచుకోవాలని భావిస్తున్నది. ఇందుకోసం జిల్లాలోని పలు ప్రాంతాలను ఎంపిక చేసింది. ముఖ్యంగా వ్యవసాయేతర భూములను గుర్తించి ల్యాండ్‌పూలింగ్ ద్వారా వాటిని సేకరించి.. అందులో భారీ లేఅవుట్లను ఏర్పాటు చేస్తే అటు రైతులు, ఇటు ప్రభుత్వానికి ప్రయోజనం కలుగుతుందని యోచిస్తున్నది. నగరం చుట్టూ విస్తరించిన ఉన్న జిల్లా లో గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు చేసిన హెచ్ఎండీఏ లేఅవుట్లలోని ప్లాట్లు హాట్‌కేకుల్లా అమ్ముడు పోయాయి.
అదే తరహాలో.. జిల్లాలో భూములకు డిమాండ్ ఉన్న ప్రాంతాలను గుర్తించి వ్యవసాయేతర భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి లేఅవుట్లు చేసి ప్లాట్లు, విల్లాలు, వాణిజ్య భవనాలను నిర్మించాలని భావిస్తున్నారు. రైతుల నుంచి సేకరించే భూమిలో 60 శాతం రైతులకు 40 శాతం హెచ్ఎండీఏ తీసుకునేలా ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నది. ఇందులో భాగంగానే తొలుత కేశంపేట మండలంలోని ఇన్ముల్‌నర్వ గ్రామంలో 95.25 ఎకరాలు, కందుకూరు మండలంలోని లేమూర్ గ్రామంలో 88.48 ఎకరాలను లేఅవుట్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అలాగే, బాలాపూర్ మండలంలోని కుర్మల్‌గూడలో 91.90 ఎకరాల భూమిని తీసుకునేందుకు ఇప్పటికే రైతులతో చర్చించినట్లు సమాచారం.
ప్రైవేట్ భూముల సేకరణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. భూసేకరణకు అడుగడుగునా అడ్డంకులొస్తున్నాయి. దీంతో వ్యవసాయేతర భూములను గుర్తించి రైతులను ఒప్పించి, రైతులకు 60 శాతం, హెచ్ఎండీఏకు 40 శాతం కేటాయించి.. లేఅవుట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. అదేవిధం గా ఆ భూములను అభివృద్ధి చేయడం తోపాటు మరికొంత భాగంలో విల్లాలు, వాణిజ్య భవనాలను నిర్మిం చాలని యోచిస్తున్నది.