కడ్తాల్, జనవరి 7: గ్రామ పంచాయతీలను అన్ని విధాల అభివృద్ధి పరచడానికి సొంత ఆదాయ వనరులు సమకూర్చుకోవడం ఎంతో కీలకమని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు. బుధవారం రాజేంద్రనగర్‌లోని వికాస్ ఆడిటోరియంలో జాతీయ గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో..ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన 40 మంది పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అధికారులతో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లో గ్రామ పంచాయతీలకు కల్పించిన అధికారాలు, వినియోగాల గురించి కాన్ఫరెన్స్‌లో వివరించినట్లు ఆయన పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీలు సొంత ఆదాయ వనరుల పెంచుకోవడంలో భాగంగా..ఇంటి పన్ను, వినోదపు పన్ను, వారాంతపు సంత, వృత్తి, వ్యాపార లైసెన్స్‌ల మంజూరు ద్వారా వచ్చే ఆదాయ వనరులపై చర్చించిన్నుట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించే నిధులతోపాటు సొంత ఆదాయ వనరుల కూర్పు ముఖ్యమన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారంతో గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. తెలంగాణలోని గ్రామాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించడంతోపాటు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్నట్లు ఆయన వివరించారు.
తాజా మాజీ సర్పంచ్ల పనితీరును ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన అధికారులు అభినందించి, తెలంగాణ గ్రామాలు దేశానికి రోల్ మోడల్ అని కితాబిచ్చిన్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ప్రొఫెసర్లు దిలీప్కుమార్పాల్, అంజన్కుమార్బాంజియా, రాజేందర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారులు అభిషేక్గుప్తా, సంజయ్‌సింగ్, డింపుల్కౌర్, అభినవ్ఓజా తదితరులు పాల్గొన్నారు.