రంగారెడ్డి, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని మున్సిపాలిటీలను నిధుల కొరత వెంటాడుతున్నది. నగరం చుట్టూ విస్తరించి ఉన్న మున్సిపాలిటీల్లో అభివృద్ధి ఆశించిన మేరకు జరుగడం లేదు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు… కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు గత సంవత్సర కాలంగా జాడ లేవు. ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మాత్రమే నియోజకవర్గ అభివృద్ధికి నిధులను హెచ్ఎండీఏ ద్వారా అరకొరగా తీసుకొస్తున్నారు. మరోవైపు పట్టణ ప్రగతి కింద మున్సిపాలిటీలకు రావాల్సిన నిధులు కూడా నిలిచిపోయాయి. దీంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు మాత్రమే కనిపిస్తున్నాయి.
భవన నిర్మాణాలు, పన్నుల వసూళ్లే ప్రధాన ఆధారం..
జిల్లాలో 13 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్ నగరం చుట్టే ఉన్నాయి. ఇందులో పెద్దఅంబర్‌పేట్, తుర్కయాంజాల్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, తుక్కుగూడ, శంషాబాద్, రాజేంద్రనగర్, మణికొండ వంటి మున్సిపాలిటీలు హైదరాబాద్‌కు అతి సమీపంలో ఉన్నాయి. గతంలో ఈ మున్సిపాలిటీలు అభివృద్ధిలో దూసుకుపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఈ మున్సిపాలిటీల్లో చేపడుతున్న భవన నిర్మాణాల అనుమతుల ద్వారా వచ్చే నిధులు, పన్నుల వసూళ్ల ద్వారా సుమారు రూ.40లక్షల నుంచి రూ.50 లక్షలు వచ్చే నిధులతో సిబ్బంది వేతనాలు, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్తు బిల్లులు చెల్లిస్తున్నట్లు మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు.
ఊసేలేని పట్టణ ప్రగతి..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి కింద ఒక్కో మున్సిపాలిటీకీ ప్రతి నెలా నిధులు కేటాయించేవారు. ఈ నిధులతో పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్తు వంటి వాటికి ఉపయోగించి పన్నులు, భవన నిర్మాణాల అనుమతుల ద్వారా వచ్చే నిధులతో అభివృద్ధి పనులు చేపట్టేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పట్టణ ప్రగతి అన్న ఊసే లేదు.
ముందుకు సాగని మున్సిపల్ అభివృద్ధి..
గత ఏడాది కాలంగా ఆమనగల్లు మున్సిపాలిటీకి సరైన నిధులు రాక అభివృద్ధి ముందుకు సాగడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క అభివృద్ధి పనిని చేపట్టకపోవడం సిగ్గుచేటు.
– వీరయ్య, ఆమనగల్లు మున్సిపాలిటీ
అభివృద్ధికి నిధులు కేటాయించాలి..
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి ఏడాది కాలంగా నిధులు రాలేదు. అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మున్సిపాలిటీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉన్నది. తాగునీటి సమస్య ఉత్పన్నమవుతున్నది. పార్కులు ఆధ్వానంగా మారాయి. రోడ్లు గుంతలమయంగా మారిన కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ నిధులు కేటాయించాలి.
– గుంటి కిరణ్, ఇబ్రహీంపట్నం