షాబాద్, ఆగస్టు 22 : రైతులందరి పంట రుణాలను మాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్ట బోమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎలాంటి ఆంక్షల్లేకుండా పంట రుణాలు మాఫీ చేయాలన్న పార్టీ పిలుపు మేరకు గురువారం చేవెళ్లలోని రైతు ధర్నాలో మాజీ మంత్రులు పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, మహమూద్‌అలీ, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, పట్నం అవినాశ్‌రెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు.
అంతకుముందు షాబాద్ చౌరస్తా నుంచి ధర్నా ప్రాంగణం వరకు పెద్ద ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం నశించాలి… రుణమాఫీ అని మోసం చేసిన రేవంత్ ప్రభుత్వం నశించాలి.. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.
ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న మొదటి సంతకం రూ.2 లక్షల పంట రుణాల మాఫీపైనే పెడుతానని చెప్పాడని.. ఎవరైనా లోన్ తీసుకోని వారుంటే త్వరగా బ్యాంకులకెళ్లి రుణాలు తెచ్చుకోవాలని చెప్పారన్నారు. చేవెళ్ల గడ్డపై నుంచి రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల రైతులతోపాటు తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా.. రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయడంతోపాటు వడ్డీ చెల్లించాలని ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టబోమని కేటీఆర్ స్పష్టం చేశారు.
రైతులు ఓట్లు వేసింది అధికారులకు కాదని.. కాంగ్రెస్ పార్టీ నేతలను గల్లాలు పట్టి నిలదీయాలన్నారు. అర్హులకు ఎందుకు మాఫీ కాలేదో గ్రామాల్లోని నాయకులను ప్రశ్నించాలన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ ఎందుకు మారారో అడగాలన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని.. భవిష్యత్తులో మరింత ఉధృతంగా పోరాడుదామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను ప్రజల ముందు పెడతామన్నారు. రంగారెడ్డి జిల్లాలోని రైతులంతా ఒక్కసారి ఆలోచించాలన్నారు. కేసీఆర్ హయాంలో ఎలా ఉండే.. ఇప్పుడు ఎలా ఉన్నదో బేరీజు వేసుకోవాలన్నారు.
కరెంట్ కోతలు, తాగు, సాగు నీరు లేకపోవడంతో ఇక్కడి పరిశ్రమలు, పెట్టుబడులు ఇతర ప్రాంతాలకు తరలిపోతుంటే మన భూములకు ధరలు వస్తాయా..? అని ప్రశ్నించారు. ఉన్న ప్రాజెక్టులను రేవంత్‌రెడ్డి రద్దు చేస్తున్నాడని ఫార్మాసిటీ, ఎయిర్‌పోర్టు వరకు వెళ్లే మెట్రోను రద్దు చేస్తే రంగారెడ్డి జిల్లా అభివృద్ధి ఏట్లయితదో ఆలోచించాలన్నారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని…భారత రైతు సమితిగా రైతుల పక్షాన పోరాడుతుందన్నారు.
కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు చిలకమర్రి నర్సింహ, డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగేందర్‌గౌడ్, దేశమళ్ల ఆంజనేయులు, కొంపల్లి అనంతరెడ్డి, పట్లోళ్ల కౌశిక్‌రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, చేవెళ్ల మాజీ ఎంపీపీ బాల్‌రాజ్, బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల, షాబాద్ మండలాల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, గూడూరు నర్సింగ్‌రావు, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగలి యాదగిరి, మాజీ వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, పార్టీ నాయకులు కొలన్ ప్రభాకర్‌రెడ్డి, బర్కల రాంరెడ్డి, నర్సింహారెడ్డి, శశిధర్‌రెడ్డి, నరహరిరెడ్డి, చల్లా శ్రీరాంరెడ్డి, మల్లారెడ్డి, చాంద్‌పాషా, సూద యాదయ్య, సుధాకర్‌రెడ్డి, మల్లేశ్, మోహన్‌రెడ్డి, సందీప్, ముఖ్రంఖాన్, రాజూగౌడ్, సురేశ్‌గౌడ్, రాములు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
షాబాద్ కళ తప్పింది..
‘మూడు రోజుల కిందట నేను శంషాబాద్ మండలంలోని నర్కుడలో జరిగే ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా.. ఆ సమయంలో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. అక్కడ ఓ తమ్ముడు నా దగ్గరికి వచ్చి అన్న బాగున్నారా.. అని పలకరించాడు. నేను కూడా బాగున్నా తమ్మి మీరెలా ఉన్నారని అడిగితే… అతడు ఒకే ఒక మాట అన్నాడు.. కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత మా షాబాద్‌కు కళనే పోయిందన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు షాబాద్, చందనవెల్లి, సీతారాంపూర్ గ్రామాలను ప్రపంచానికి తెలిసేలా చేశారని.. శంకర్‌పల్లిలో రైలు డబ్బాలు తయారవుతున్నాయి. చందనవెల్లిలో తయారైన కార్పెట్లు సిలికాన్‌కు వెళ్తున్నాయంటే అది కేసీఆర్ పుణ్యమేనని” రవీందర్‌రెడ్డి అనే తమ్ముడు చెప్పాడని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు అరిగోస పడుతున్నాడని.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆగమవుతున్నారన్నారు.
హమీలను నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం..
పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి చేవెళ్లకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కేసీఆర్ అది చేయలేదు.. నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తానని ప్రజలను నమ్మించి ఓట్లు దండుకున్నాడు. రుణమాఫీ చేసిన అని చెబుతున్నారు. ఒక రంగారెడ్డి జిల్లాలో 2,80,000 మంది రుణాలు తీసుకుంటే ప్రభుత్వం మాఫీ చేసింది కేవలం 75,000 మందికే. రైతులను బ్యాంకులు, వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారు కానీ.. ఇంతవరకు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేయలేదు.
ఇంతకుముందు కేసీఆర్ రెండు పర్యాయాలు రుణమాఫీని సక్రమంగా చేపట్టారు. కానీ.. రేవంత్‌రెడ్డి సర్కార్ కొద్దిమందికే రుణమాఫీ చేసి అందరికీ పూర్తి చేశామని గొప్పలు చెప్పుకొంటున్నది. సీఎం సొంతూరులెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య. సీఎంగా ఎక్కడికెళ్తే అక్కడ ఉన్న దేవుళ్లపై ఒట్లు వేశాడు. కానీ.. అతడి ఒట్ల నుంచి చేవెళ్ల వెంకటేశ్వరస్వామి మాత్రం తప్పించుకున్నారు.
నువ్వు నా దగ్గరికి రావొద్దని.. దేవుడే రానియ్యలేదు. గ్రామాల్లో రుణమాఫీ కాని అన్నదాతల జాబితాను తయారు చేసి రేవంత్‌రెడ్డికి ఇద్దాం. అతడు చేవెళ్ల నుంచే కొడంగల్‌కు వెళ్తాడు. ఇంద్రారెడ్డి విగ్రహం వద్ద రుణమాఫీ కాని రైతుల జాబితాను పెడితే.. రేవంత్‌రెడ్డి ఈ దారిలో కాకుండా వేరే దారిలో తన స్వగ్రామానికి వెళ్తాడెమో..! ప్రతి రైతుకూ రుణమాఫీ అయ్యేవరకు పోరాడుదాం. గ్రామాల్లోని ప్రజలంతా ఆలోచిస్తున్నారు.. కేసీఆర్‌ను ఓడించి మోసపోయామని, ఎన్నికలు ఎప్పుడొస్తాయని ఎదురుచూస్తున్నారు.
మరో ఉద్యమానికి సిద్ధం కావాలి..
– స్వామిగౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్
తెలంగాణలో మరో ఉద్యమానికి సిద్ధం కావాలి. దగుల్బాజీలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్. మరో నాలుగైదు రోజులైతే 11 మంది రోడ్డుపైకి వచ్చి మమ్మల్ని కాపాడాలని కేసీఆర్ దగ్గరికి వచ్చే పరిస్థితి కనబడుతున్నది. వారిని మళ్లీ పార్టీలోకి చేర్చుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు రుణమాఫీ చేస్తామని కనిపించిన దేవుళ్లకు దండం పెట్టి రేవంత్‌రెడ్డి మోసం చేశారు. బ్యాంకుల్లో రూ.2,20,000 రుణముంటే ముందు రైతును రూ.20 వేలు కట్టమని చెప్పి, ఆ తర్వాత రూ.2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పడం సరికాదు. కల్యాణలక్ష్మి కింద రూ. లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాలి. రైతులందరికీ రూ.2 లక్షల వరకు షరతుల్లేకుండా రుణమాఫీ చేయాలి.
రైతులు ఎంతో బాధపడుతున్నారు..
– పట్నం అవినాశ్‌రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకుడు, షాబాద్
గ్రామాల్లోకి వెళ్తే ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు చెబుతున్నారు. కేసీఆర్‌ను గెలిపించ నందుకు రైతులు ఎంతో బాధపడుతున్నారు. మేము పెద్ద తప్పు చేశామని ప్రజలు, రైతులు అనుకుంటున్నారు. రైతుల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేశారు. కరెంట్, సాగునీరు అందించి వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ వెంటనే చేయాలి.
రైతు పక్షపాతి కేసీఆర్
మహమూద్ అలీ, మాజీ ఉప ముఖ్యమంత్రి
ఇండియాలో రైతుల సంక్షేమానికి పాటుపడిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్. 14 ఏండ్లు ఉద్యమం చేసి తెలంగాణను సాధించారు. తెలంగాణ రాక ముందు ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రధాని మోదీ బోర్లకు మీటర్లు పెట్టాలని చెబితే.. ప్రాణం పోయినా రైతుల మోటర్లకు మీటర్లు పెట్టనని కేసీఆర్ తేల్చిచెప్పారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని కేసీఆర్ ఉద్దే శం. రైతుల కోసం ఢిల్లీలో ధర్నాలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. చనిపోయిన రైతుల కుటుంబాలకు రైతుబీమా కింద పరిహారాన్ని అందించి ఆదుకున్నారు. దేశంలోనే రైతుల సంక్షేమానికి ఆయన పెద్దపీట వేశారు. కాంగ్రెస్ పార్టీ దొంగ పార్టీ, రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది.
ఎనిమిది నెలల్లో ఎంతో మోసం
పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర యువనాయకుడు
ఈ ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఎంతో మోసం చేసింది. అధికారంలోకి రాకముందు రేవంత్‌రెడ్డి డిసెంబర్ 9న మొదటి సంతకం రూ.2 లక్షల పంట రుణాల మాఫీపైనే పెడుతానని చెప్పాడు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విశ్వసించడంలేదని భావించిన సీఎం దేవుళ్లపై ఒట్లు వేసి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని చెప్పారు. అర్హులందరికీ రుణమాఫీ చేయలేదు. కొందిమందికే చేసి చేతులు దులుపుకొన్నారు. రాష్ట్ర సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవడంతో తెలంగాణ సమాజం అంతా వ్యతిరేకిస్తున్నది. తెలంగాణలో తెలంగాణ తల్లి ముద్దు…రాజీవ్‌గాంధీ వద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాడుతాం.