పరిగి/కులకచర్ల, జూన్ 26 : రాబందు ప్రభుత్వం పోయి.. రైతుబంధు సర్కార్ రావాలని రాష్ట్రంలోని ప్రజలందరూ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసే దమ్ము రేవంత్ సర్కార్‌కు లేదని ఎద్దేవా చేశారు. శుక్రవారం పరిగిలోని ఎస్ గార్డెన్లో మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అధ్యక్షతన సర్(ఎస్ఐఆర్)పై, బీఆర్ఎస్ బీఎల్ఎలు, పార్టీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాట్ల సమయంలో పెట్టుబడి సాయం వేస్తే.. కాంగ్రెస్ ఓట్ల సమయంలో వేస్తున్నదని మండిపడ్డారు.
అసైన్డ్ భూములకు పట్టాలిస్తానని గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి ..ఆ పొలాలకు పట్టాలివ్వకుండానే ప్రజల నుంచి బలవంతంగా లాక్కుకుంటున్నాడని ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 90శాతం పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తయ్యాయని.. ఒక పంపును కూడా ఆన్ చేశామని గుర్తు చేశారు. కాల్వలు తవ్వితే చాలు వికారాబాద్ జిల్లాలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు వస్తుందని..చేతకాని కాంగ్రెస్ పాలకులతో ఆ పనులు కావని ఎద్దేవా చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా పరిగిలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇచ్చే బాధ్యతను కేసీఆర్ నాయకత్వంలో మనం తీసుకుందామని.. ఈ విషయాన్ని ఈ ప్రాంత రైతులకు చెప్పాలని కేటీఆర్ సూచించారు.
కాంగ్రెస్ నాయకులకు కమీషన్లు తీసుకోవడం, కాంట్రాక్టులు చేయడం తప్ప ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాంట్రాక్టులిచ్చే ఆలోచనే లేదన్నారు. రైతులకు నీళ్లు ఇచ్చే ఉద్దేశమూ వారికి లేదని మండిపడ్డారు. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కాల్వలు తవ్వితే పరిగి నియోజకవర్గానికి లక్ష ఎకరాలు, కొడంగల్ నియోజకవర్గానికి లక్షా 20వేల ఎకరాలకు సాగునీరు అం దేలా బీఆర్ఎస్ హయాంలోనే సిద్ధం చేశామని.. రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత కాల్వల పనులను అటకెక్కించారని మండిపడ్డారు. తనకు కమీష న్లు, తన కుటుంబ సంపాదనకోసం రూ. 4,400 కోట్లతో ప్రత్యేకంగా కొడంగల్ లిఫ్ట్ పెట్టారని, కాంగ్రెస్ చెప్పినట్టు 72శాతం, సుమారు రూ.3 వేల కోట్ల కాంట్రాక్టు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వా ల్సి ఉండగా.. మూడు రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. లగచర్లలో గిరిజన ఆడబిడ్డలను అవమానించి, ఇంటిపై దాడి చేసి రేవంత్ దుశ్వాసన పర్వానికి పాల్పడ్డారన్నారు. మా భూములు మాకే ఉండాలి, భూములు ఇవ్వమంటే కేసులు పెట్టి హింసించి, 37 మందిని జైలు లో పెట్టారన్నారు.
హీర్యానాయక్ అనే రైతుకు జైలులో గుండెపోటు వస్తే పోలీసులు బేడీలు వేసి దవాఖానకు తీసుకెళ్లగా.. అక్కడ మంచానికి కట్టేసి వైద్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్లలో జరిగిన దుర్మార్గమే పరిగిలోనూ జరుగబోతున్నదని ఆందోళన వ్యక్తం చేశా రు. ఎస్సీ, ఎస్టీల భూములను ఇష్టానుసారంగా గుంజుకుంటామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. రాకంచర్లలో పరిశ్రమలు పెట్టకుండానే అయిదారు వేల ఎకరాలను సేకరించాలనుకోవడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలిచ్చిన తర్వాత భూసేకరణ చట్టం ప్రకారం వారికి న్యాయమైన పరిహారమిచ్చి భూములను తీసుకోవాలని.. బలవంతంగా తీసుకుంటామంటే ఊరుకోమని న్యాయ పోరాటం చేస్తామన్నారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పిల్లలకు ఇచ్చే గుడ్లు, బ్రెడ్డు, పాలు, భోజనం వంటి కాంట్రాక్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కాకుండా పెద్ద వారికి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నదని కేటీఆర్ ఆరోపించారు. మోసపోకండి, మోసకారి కాంగ్రెస్‌ను నమ్మకండి, నమ్మితే గోసపడతారని పరిగిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంగా చెప్పారన్నారు. కేసీఆర్‌కు పదవులు కొత్త కాదని, 50 ఏండ్ల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారన్నారు. పరిగి సెగ్మెంట్లో పారిశ్రామిక పార్కులు, రోడ్ల పేరిట పేదల భూములు గుంజుకుంటున్నారని రైతుల పక్షాన మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పోరాటం చేస్తుంటే ఆయన్ను రేవంత్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిందని మండిపడ్డారు. మహేశ్‌రెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు పాటుపడాలన్నారు.
నియోజకవర్గంలో ఏ ఎన్నిక వచ్చినా పార్టీ అభ్యర్థుల గెలుపునకు శ్రేణులు కృషి చేయాలి. మా జీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ఎంతో ఉత్సాహంతో ఉన్నారు. ఆయన వెంట ఉండి పార్టీ బలోపేతానికి పాటుపడాలి. రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉండి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నీళ్లు ఇప్పటికే పరిగిలో పారుతుండేవి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగాకేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.
-సబితాఇంద్రారెడ్డి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే
పరిగి : ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ భూములను సర్కారు గుంజుకోవాలని చూస్తున్నదని.. భూములు పోకుండా చూడాలని మండలంలోని కాళ్లాపూర్ గ్రామ రైతులు బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి విన్నవించారు. ఉన్న కొద్దిపాటి భూములు పోతే తాము రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన అవసరమైన న్యాయ పోరాటం చేస్తామని వారికి హామీ ఇచ్చారు.
అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నది. 30 నెలలు గడిచినా ఇచ్చిన హామీల్లో ఒక్క దానిని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. సమస్యలపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నది. ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని గ్రామాల్లో బీఎల్ఏ లు అప్రమత్తంగా నిర్వహించాలి. అర్హుల ఓట్లు పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిగి నియోజకవర్గంలో 2,76,000 ఓట్లుడగా..అందులో మ్యాపింగ్ అయిన ఓట్లు 1,39,000 మాత్రమే. మిగిలిన వారు కూడా ఓటును నమోదు చేయించు కోవాలి. నియోజకవర్గంలో సభ్యత్వం ఉండి చనిపోయిన 58 మంది కార్యకర్తలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందుతుంది. కేసీఆర్ అమలు చేసిన పథకాలు దేశంలో ఎవ్వరూ అమలు చేయలేదు. రేవంత్ కనీసం రుణమాఫీని కూడా సక్రమంగా చేయలేకపోయారు. పాలమూరు -రంగారెడ్డి ద్వారా పరిగికి నీళ్లు తెచ్చేందుకు టెండర్ల వేస్తే వాటిని సీఎం పట్టించుకోవడంలేదు. జిల్లా ప్రజలపై రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే ఉదండాపూర్ ప్రాజెక్టును పూర్తి చేసి వెంటనే నీళ్లు అందించాలి.
-కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే
బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి. అర్హుల ఓట్లు పొకుండా చూసుకోవాలి. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు ఐక్యంగా పనిచేయడంతో పరిగిలో ఎక్కువగా స్థానాలను గెలుచుకోగలిగాం. పరిగి నియోజకవర్గంలో శ్రేణులు ఎంతో ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.
-ఎంఎన్ శ్రీనివాస్‌రావు, పార్టీ సభ్యత్వ నమోదు పరిగి నియోజకవర్గం ఇన్చార్జి
పార్టీకి చెందిన బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. 18 ఏండ్లు నిండిన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్పించడంతోపాటు చనిపోయిన వారి పేర్లు తీయించాలన్నారు. పరిగి నియోజకవర్గంలో 90వేల ఓట్లు మ్యాపింగ్ జరగలేదని, మ్యాపింగ్ జరగని ఓట్లు ఏ బూత్‌లో ఉన్నాయో పరిశీలించి చెప్పి మ్యాపింగ్ చేయించాలన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే పరిగి నియోజకవర్గంలోని 305 బూత్‌లలో, ప్రతి బూత్లోనూ కేసీఆర్‌లా పనిచేయాలని శ్రేణులకు సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రత్యేక డిజిటల్ యాప్ తయారు చేశామని, ప్రతి బూత్‌కు ఇద్దరు కార్యకర్తల చొప్పున 610 మందికి వికారాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. పదేండ్ల పాలనలో ప్రభుత్వాన్ని నడపడంపైనే ఫోకస్ పెట్టామని, అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేశామని.. కార్యకర్తలు, ఉద్యమకారులను ఖదరు లేదనే ఫీలింగ్ ఉందని, ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ప్రాధాన్యమిస్తామన్నారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఓ తమ్ముడు చెప్పారని, రేవంత్‌రెడ్డి ఆరిపోయే దీపమని, ఆయన ఎక్కువ రోజులు ఉండరని, ఆ తర్వాత మిమ్మల్ని కాపాడేవారు ఎవరు ఉండరని హెచ్చరించారు.