15 నుంచి 18 ఏండ్ల లోపు వారికి నేటి నుంచి కొవిడ్ టీకా
జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల్లో ఆన్లైన్, ఇతర ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్
పెద్దల మాదిరిగానే చిన్నారులకూ 28 రోజుల తర్వాత సెకండ్ డోస్
రంగారెడ్డి జిల్లాలో 2,24,664 మంది, వికారాబాద్ జిల్లాలో 77,780 మంది పిల్లలు
వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్యశాఖ
షాబాద్ / పరిగి, జనవరి 2 :కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటి వరకు పెద్దలకు మొదటి, రెండో డోస్ టీకాలు వేస్తుండగా, నేటి నుంచి 15 నుంచి 18 ఏండ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల్లోని పిల్లలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లోని వారు ఆధార్‌కార్డు తీసుకుని వ్యాక్సిన్ కేంద్రానికి వెళితే టీకా వేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పెద్దల మాదిరిగానే పిల్లలకూ 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ వేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 2,24,664 మంది పిల్లలు ఉండగా, 46 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వికారాబాద్ జిల్లాలో 77,780 మంది పిల్లలు ఉండగా, 26 దవాఖానల్లో టీకా వేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
కరోనా మహమ్మారి వ్యాప్తిని పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు 15 నుంచి 18 ఏండ్లలోపు వయసు వారికి కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఇందుకు సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 15 నుంచి 18ఏండ్లలోపు వయసు వారు 77780 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వారందరికీ కొవిడ్ టీకాలు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాధ్యమైనంత త్వరగా వారికి వంద శాతం మందికి టీకాలు వేయడం ద్వారా కరోనా వ్యాప్తిని నియంత్రించవచ్చని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. ఈ వయసు వారికి కేవలం కొవాగ్జిన్ టీకాలు వేయనున్నారు. వికారాబాద్ జిల్లాలో ఆదివారం నాటికి 38830 డోసులు కొవాగ్జిన్ టీకాలు అనంతగిరి టీకాల నిలువల కేంద్రంలో నిల్వ ఉంచారు. అవసరం మేరకు టీకాలు ఎప్పటికప్పుడు తెప్పించడానికి అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.
వసతులున్న దవాఖానల్లోనే టీకాలు
ఇతర వయసుల వారికి వలె కాకుండా 15 నుంచి 18 ఏండ్లలోపు వారికి వసతులున్న దవాఖానల్లోనే టీకాలు వేయాలని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా జిల్లా పరిధిలోని తాండూరులోని జిల్లా దవాఖాన, పరిగి, వికారాబాద్, మర్పల్లి క్లస్టర్ హెల్త్ సెంటర్లు, 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే 15 నుంచి 18ఏండ్లలోపు వయసు వారికి టీకాలు వేయనున్నారు. ఆధార్ లేదా స్టూడెంట్ ఐడీ కార్డుతో కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆయా కేంద్రాల్లో టీకాలు వేస్తారు. లేదంటే ఆయా కేంద్రాల వద్దకు వచ్చి గుర్తింపు కార్డు ఆధారంగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. మొదటి డోసు వేసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు టీకా వేయాలి. టైఫాయిడ్, టీడీ, ఏఆర్వీ తదితర వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఆ తేదీ నుంచి 4 వారాల తర్వాత కొవిడ్ టీకా తీసుకోవచ్చు. కొవిడ్ సోకి తగ్గిన వారు 3 నెలల తరువాత కొవిడ్ టీకా తీసుకోవచ్చు.
రంగారెడ్డిజిల్లాలో..
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 15-18ఏండ్ల లోపు పిల్లలు 2,24,664 మంది ఉండగా, వీరిలో బాలురు 1,14,556 మంది, బాలికలు 1,10,108 మంది ఉన్నట్లు సంబంధిత వైద్యశాఖ అధికారులు గుర్తించారు. గతంలో మాదిరిగా కాకుండా ప్రభుత్వ దవాఖానల్లో మాత్రమే టీకా వేయనున్నారు.
జిల్లాలో 2,24,664 మంది..
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 15-18ఏండ్ల లోపు పిల్లలు 2,24,664 మంది ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 46 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సీహెచ్‌సీ, పీహెచ్సీ, ఏరియా దవాఖానల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మాత్రమే పిల్లలకు టీకాలు వేయనున్నారు.
ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లు
ఈ నెల 3వ తేదీ నుంచి 15-18ఏండ్ల లోపు వారికి టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల్లో ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించగా, గ్రామీణ ప్రాంతాల్లో ఆఫ్‌లైన్ ద్వారా ఆధార్‌కార్డుల వివరాలతో పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ వేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.