ఆదిబట్ల, ఏప్రిల్ 7 : భూమికి భూమి ఇవ్వాలి.. లేదం టే ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచి చెల్లించాలని కొంగరకలాన్ రైతులు డిమాండ్ చేశారు. సోమవారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 13నుంచి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు 300 అడుగుల గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం భూమిని సేకరిస్తున్నది. దీంతో కొంగరకలాన్ గ్రామంలో రోడ్డు వెడల్పులో భూములు కోల్పోతున్న 22 మందికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, భూసేకరణ అధికారులు గత నెల 25న నోటీసులు జారీ చేశారు.
సోమవారం హెచ్ఎండీఏ ఏఈ రాజీవ్, రంగారెడ్డి జిల్లా భూసేకరణాధికారి రాజు, ఇబ్రహీంపట్నం రెవెన్యూ అధికారులు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో 300 ఫీట్ల వరకు భూములు కోల్పోతున్న రైతులతో కొంగరకలాన్‌లో గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడు తూ.. భూమికి భూమి ఇవ్వాలి..లేదంటే ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచి చెల్లించకుంటే తమ భూములను ఇచ్చే ప్రసక్తే లేదని రాతపూర్వకంగా రాసి ఇవ్వ గా.. అధికారులు దానిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో గ్రామంలోని రోడ్డు ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులు పాల్గోన్నారు.