కొందుర్గు, జులై 5 : ఆ గతుకుల రోడ్డుపై ప్రయాణం సాగించేందుకు వాహనదారులు ప్రతినిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. కాంట్రాక్టర్ పనులు చేయకుండా వదిలివేయడంతో ఆ రోడ్డు ద్వారా రాకపోకలు సాగించాలంటే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివరాలలోకి వెళితే చౌదరిగూడెం నుంచి తూంపల్లి మీదుగా కొందుర్గుకు వెళ్లే రహదారి ప్రయాణికుల పాలిట ప్రాణ సంకటంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టర్ రోడ్డును త్రవ్వి పనులు చేయకుండా వదిలివేశాడు. దీంతో ఆరోడ్డు గుండా వెళ్లాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. రోడ్డును మధ్యలో మూడు ఫీట్లు బిటి ఉంచి రెండు వైపులా రోడ్డు తవ్వి వదిలేశాడు. రోడ్డు పనులు చేయడం లేదు.
దీంతో ఆ దారి ప్రమాదాలకు నిలయంగా మారింది. చౌదరిగూడెం నుండి తూంపల్లి ద్వారా కొందుర్గు వెళ్తే రెండు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీంతో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఈ రోడ్డు ద్వారా వెళ్తుంటారు. ఉన్న రోడ్డును తవ్వి గుంతలమయంగా చేయడంతో ప్రయాణికులు అతి కష్టంగా వాహనాలను నడిపిస్తున్నారు. దీనికి తోడు క్రషర్ మిషన్ నుంచి భారీ వాహనాలు నిత్యం ఈ దారి గుండా వెళ్తుంటాయి. దీంతో రోడ్డు మరింత అధ్వాన్నంగా తయారైంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఆ కాంట్రాక్టర్‌తో రోడ్డు పనులు పూర్తి చేయించి ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు.