ఆదిబట్ల, డిసెంబర్ 24 : మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు కొండ్రు పుష్పలీల శ్రేణులపై అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధి కొంగరకలాన్‌లోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రమిచ్చారు. అనంతరం ఆ చౌరస్తా నుంచి కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు ర్యాలీగా కాంగ్రెస్ శ్రేణులు వెళ్తుండగా అప్రమత్తమైన పోలీసులు కలెక్టరేట్ మెయిన్ గేట్‌ను మూసేశారు.
దీంతో అక్కడ కాంగ్రెస్ నాయకులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు గేటు తెరిచారు. ఒక్కసారిగా వారందరూ లోపలికి దూసుకెళ్లడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ క్రమంలో మాజీ మంత్రి కొండ్రు పుష్పలీల కిందపడి పోయారు. పోలీసులు వెంటనే ఆమెను పైకి లేపి పక్కకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలో మహిళలకు గౌరవం లేదని.. కిందపడినా పట్టించుకోకుండా, చూడకుండా వెళ్లిపోయారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పై స్థాయి నాయకత్వం మహిళలపై గౌరవంగా ఉండేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, శంకర్, మల్రెడ్డి రాంరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.