కొడంగల్ : అంతర్జాతీయ స్థాయి పరుగు పందెంలో మెరిసి గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి శుక్రవారం సన్మానించి అభినందించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణానికి చెందిన మహేష్ కుమారులు కిరణ్, రాకేష్. చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్‌పై మక్కువను పెంచుకొని ప్రతి పోటీలో పాల్గొంటూ వచ్చారు. ఏ పోటీలో పాల్గొన్న తమ సత్తాను చాటుకొని విజేతలుగా నిలుస్తూ వస్తున్నారు. తండ్రి మటన్ వ్యాపారి అయినప్పటికీ చిన్నారులను అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా పోత్సహాన్ని అందించారు.
దీంతో మండలస్థాయి నుంచి జిల్లా రాష్ట్ర స్థాయి వరకు పోటీల్లో పాల్గొని గెలుపొంది జాతీయస్థాయి పోటీలో తమదైన ఉనికిని చాటుకున్నారు. గత నెల నవంబర్ 24, 25వ తేదీల్లో నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ పరుగు పెందెం పోటీలో కిరణ్ పాల్గొని గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకున్నాడు. అదే విధంగా గోవాలో జరిగిన అంతర్జాతీయ పరుగు పందెం పోటీలో రాకేశ్ పాల్గొని గోల్డ్‌మెడల్‌ను సాధించాడు. అంతర్జాతీయస్థాయిలో కొడంగల్ ప్రతిభను చాటినందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఇద్దరు గోల్డ్ మెడలిస్టులను ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు.
ఆర్థిక పరిస్థితుల కారణంగా క్రీడల్లో రాణించలేదని ఈ విద్యార్థులకు క్రీడల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కొడంగల్ విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో మెరిసినందుకు ఎమ్మెల్యే సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్‌యాదవ్, చాంద్‌పాషా పాల్గొన్నారు.