ముఖ్యమంత్రి అల్పాహార పథకం విద్యార్థులకు గొప్ప వరమని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం తుక్కుగూడ మున్సిపాలిటీలోని రావిర్యాల ఉన్నత పాఠశాల ‘సీఎం అల్పాహారం’ పథకాన్నివిద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ కేసీఆర్ మానవతా దృక్పథంతో విద్యార్థులకు అల్పాహారాన్ని అందిస్తున్నారన్నారు. ఇది కేవలం విద్యార్థుల కడుపు నింపే కార్యక్రమం మాత్రమే కాదని, డ్రాపౌట్స్ తగ్గించి విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెచ్చే పథకమన్నారు. పదోతరగతి విద్యార్థుల వరకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్లలోఈ పథకం అమలవుతుందన్నారు.సీఎం కేసీఆర్ ఏ పథకాన్ని అమలు చేసినా ప్రజా కోణంలో ఆలోచిస్తారని, అందుకే అన్ని పథకాలు విజయవంతమవుతున్నాయన్నారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 23లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. చాలామంది విద్యార్థులు పస్తులతోనే పాఠశాలలకు వస్తున్నారని, దీన్ని గమనించిన సీఎం కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అల్పాహారం నాణ్యతను పరిశీలించేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు పాఠశాలలను తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. అనంతరం మంత్రులు హరీశ్‌రావు, సబితారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు విద్యార్థుల పక్కనే కూర్చుని అల్పాహారం తిన్నారు. మంత్రులు స్వయంగా విద్యార్థులకు టిఫిన్‌ను తినిపించడం చూపరులను ఆకట్టుకున్నది.
రంగారెడ్డి, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ) : సీఎం అల్పాహారం కార్యక్రమం విద్యార్థులకు గొప్ప వరమని, ఈ పథకం విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న ‘సీఎం అల్పాహారం’ పథకాన్ని శుక్రవారం మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలోని రావిర్యాల ఉన్నత పాఠశాల వేదికగా లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏ పథకాన్ని అమలు చేసినా ప్రజా కోణంలో ఆలోచిస్తారని, అందుకే అన్ని పథకాలు విజయవంతం కావడంతోపాటు సామాజిక మార్పునకు కారణం అవుతున్నాయన్నారు.
కల్యాణ లక్ష్మి పథకంలో ఇచ్చే రూ.లక్ష సాయంతో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. కేసీఆర్ కిట్ వల్ల వంద శాతం ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు జరుగుతున్నాయన్నారు. మిషన్ భగీరథ పథకంతో సురక్షిత తాగునీటి సరఫరా వల్ల సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు. కేసీఆర్ అల్పాహారం పథకం విద్యార్థుల కడుపు నింపే కార్యక్రమం మాత్రమే కాదని, డ్రాప్ఔట్స్ తగ్గించి విద్యార్థులు బడి బాట పట్టించి విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పు తెచ్చే పథకమని పేర్కొన్నారు. బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, వెయ్యి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణేనని అన్నారు. దసరా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం అమలులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు రంజిత్ రెడ్డి, పాటిల్, జడ్పీ చైర్పర్సన్ అనితాహరినాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, దయానంద్ గుప్తా, రఘోత్తమ్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సత్తు వెంకటరమణరెడ్డి, పంచాయతీ రాజ్ డైరెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకిటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, కలెక్టర్ హరీశ్, డీఈవో సుశీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
విర్యాల ఉన్నత పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభోత్సవానికి పాఠశాల విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ మొదటి రోజు మెనూలో ఇడ్లీ సాంబారు, పూరీ, ఆలూకుర్మాలను అందించారు. విద్యార్థుల పక్కనే కూర్చుని వారితో కలిసి మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు టిఫిన్ తిన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు టిఫిన్‌ను తినిపించారు. కార్పొరేట్ స్థాయిలో బోధన అందించడంతోపాటు మూడుసార్లు విద్యార్థులకు రాగి జావ, బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం సదుపాయాన్ని కల్పించడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్ మానవీయతతో అమలు చేసే ప్రతీ పథకం సూపర్ హిట్ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రావిర్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని మంత్రి హరీశ్‌రావుతో కలిసి ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 27వేల పాఠశాలల్లోని 23లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. చాలామంది విద్యార్థులు పస్తులతోనే పాఠశాలలకు వస్తున్నారని, ఇటువంటి వారిని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావతోపాటు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. ఖర్చుకు వెనుకాడకుండా మన ఊరు-మన బడి కార్యక్రమంలో రూ.7వేల కోట్లు ఖర్చుచేసి చేపట్టిన పనులతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయన్నారు. ఆంగ్ల మాధ్యమంపై విద్యార్థుల తల్లిదండ్రులకు ఉన్న తపనను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ స్థాయిలో అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. అల్పాహారం నాణ్యతను పరిశీలించేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు పాఠశాలలను తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.
ఇప్పటికే ప్రతి విద్యార్థికీ మధ్యాహ్న భోజనం అందిస్తున్న ప్రభుత్వం ఉదయం సమయంలో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పేరుతో టిఫిన్ అందించడం ఎంతో గొప్ప విషయం. ఉదయం వేళలో కనీసం టిఫిన్ చేయకుండానే పాఠశాలకు వస్తుంటాం. ఇలాంటి సమయంలో పాఠశాలలో టిఫిన్ అందించడం మాకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– సౌమ్య, 9వ తరగతి, దండుమైలారం, ఇబ్రహీంపట్నంరూరల్