పరిగి, జూన్ 9 : బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే తెలంగాణ రాష్ర్టానికి రక్షణ కవచంగా ఉన్నదని ప్రజలు భావిస్తున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి అన్నారు. అనుక్షణం రాజకీయంతోనే బతకాలని కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు. గతంలో కేసీఆర్, రాజశేఖర్‌రెడ్డిల హ యాంలో అసెంబ్లీ ఎన్నికలైన ఏడాదిలోపే అన్ని ఎన్నికలు నిర్వహించి మిగతా నాలుగేండ్లు అభివృద్ధిపై దృష్టి పెట్టారన్నారు. హామీల అమలు చేతకాకే కేసీఆర్‌పై విమర్శలు చేస్తూ రేవంత్‌రెడ్డి కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు.
రేవంత్‌రెడ్డి ప్రగతిని పక్కన పెట్టి 24 గంటలూ రాజకీయం చేస్తున్నారన్నారు. అందువల్లే ఆరు నెలలకొకటి, ఏడాదికొక ఎన్నిక పెడుతున్నారని దుయ్యబట్టారు. మంగళవారం పరిగిలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు మండల స్థాయి సమన్వయ కమిటీల సమావేశంలో సబితారెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. సింగిల్ విండో చైర్మన్ ఎన్నికలు పెట్టేందుకూ ప్రభుత్వానికి ధైర్యం లేకే నామినేట్ చేస్తున్నాదని ఆరోపించారు. 30 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. రాష్ట్రంలో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని.. ఎవరితో మాట్లాడినా మళ్లీ కేసీఆర్ సారే రావాలని కోరుకుంటున్నారని తెలిపా రు. మళ్లీ బీఆర్ఎస్ గెలిచి కేసీఆర్ సీఎంగా, మహేశ్‌రెడ్డి ఎమ్మెల్యే అయి ఉంటే ఈ పాటికి పరిగికి సాగునీరు వయ్యేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేస్తామంటే కానీ రేవంత్‌రెడ్డికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల గుర్తుకు రాలేదని సబితారెడ్డి ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మొద్దునిద్రలో ఉందని, బీఆర్ఎస్ పార్టీ పోరాటాలతోనే మేల్కొంటుందన్నారు. మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్‌రెడ్డి విజన్ తో పనిచేయడంతోనే పరిగి నియోజకవర్గంలోని స్కూళ్లకు అవసరమైన భూములను కేటాయించారని, రోడ్లు చక్కగా వేయించారని గుర్తు చేశారు. ‘సర్’పై పార్టీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని, బూత్ స్థాయిలో ఉండే బీఎల్ఏలు ప్రతి ఓటరు వివరాలు సరిచూసి, లేనివారి పేర్లు తొలగించేలా, ఉన్నవారి పేర్లు జాబితాలో చేర్చేలా చొరవ తీసుకోవాలన్నారు. 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేస్తున్నారని, మ్యాపింగ్‌లో ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు.
అర్బన్ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల వారి పేర్లు ఓటర్ల జాబితాలో రాయిస్తారని, ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో చేవెళ్లలో కులకచర్ల, గండీడ్ మండలాల వారి పేర్లు రాయించారని విమర్శించారు. ఒక వార్డు లో 300 మంది బయటివారి పేర్లు ఓటర్ల జాబితాలో రాయించారని, బయటి ఓట్లతోనే కాంగ్రెస్ గెలిచిందన్నారు. పార్టీ శ్రేణులు డిజిటల్ సభ్యత్వ నమోదును సక్సెస్ చేయాలన్నారు. మెంబర్షిప్ డ్రైవ్ కోసం నియోజకవర్గానికి ఒక ఇన్చార్జితోపాటు సాంకేతిక సమస్యలొస్తే పరిష్కరించేందుకు మరో వ్యక్తిని ఇస్తారన్నారు.
బూత్ లెవల్ కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి నియోజకవర్గానికీ వస్తారని పేర్కొన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర కమిటీల్లో ఉండాలనుకునేవారు తప్పనిసరిగా క్రియాశీలక సభ్యత్వం తీసుకోవా లన్నారు. పరిగిలో బీఆర్ఎస్ కేడర్ మంచి పోరాటం చేస్తున్నదని సబితారెడ్డి అభినందించారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి నాయకత్వంలో పోరాడి భూసేకరణతో భూములు కోల్పోయే రైతులకు భరోసా కల్పించారన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మండల స్థాయిలో పదిమందితో సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ప్రతి బూత్‌లో ఒక మహిళ ఉండేలా చూసుకోవాలని, ప్రతి గ్రామంలో ఇద్దరు సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పరిగి మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ ఎంపీపీలు అరవిందరావు, మల్లేశం, దోమ మాజీ జడ్పీటీ సీ కొప్పుల నాగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కొప్పల శ్యాంసుందర్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్.ఆంజనేయు లు, బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బి.శ్రవణ్‌కుమార్‌రెడ్డి, మీర్ మహమూద్‌అలీ, భాస్కర్, అశోక్‌రెడ్డి, పీరంపల్లి రాజు, మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ మండలాల సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి కార్డులు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. యాప్‌లో పేరు, ఫోన్ నంబర్ ఎంట్రీ చేయడంతో పూర్తి వివరాలు అందులో ఉంటాయి. డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు ఉంటుంది. ‘సర్’ సందర్భంగా ఓటరుగా పేరున్న వారు గ్రామాల్లో ఉంటే వారి పేరు జాబితాల్లో ఉండేలా చూడడం, లేనివారి పేర్లు ఉంటే తొలగించేలా చర్యలు తీసుకోవాలి. అధికారులను ప్రభావితం చేసి బీఆర్ఎస్ వారి పేర్లు తొలగించే ప్రమాదముంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. పరిగిలో గత నలభై ఏండ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలున్నారు. మరింత పకడ్బందీగా సభ్యత్వ నమోదు చేపట్టాలి.
-డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే
సభ్యత్వ నమోదును సక్సెస్ చేయాలి
‘సర్’పై పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండడంతోపాటు పార్టీ సభ్యత్వ నమోదును సక్సెస్ చేయాలి. ప్రతి మండలానికి ఐదుగురితో కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకుని సమన్వయంతో పనిచేయాలి. ప్రతి కార్యకర్త ఇంటింటికెళ్లి సభ్యత్వ నమోదు చేయించాలి. రానున్న రెండ్లేండ్లు అత్యంత కీలకం. నియోజకవర్గంలోని 305 బూత్‌లలో ఒకరు సభ్యత్వ నమోదును చూసారు. త్వరలో నిర్వహించే బూత్ స్థాయి నాయకులు, ఏజెంట్ల సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారు. గతంలో ప్రమాదంలో చనిపోయిన 36 మంది కార్యకర్తలకు రూ. 2 లక్షల చొప్పున బీమా డబ్బులు వచ్చాయి. ప్రతి గ్రామానికి వచ్చి గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తా. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం దక్కుతుంది.
-కొప్పుల మహేశ్‌రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే
బోగస్ ఓట్లు ఉండొద్దు..
‘సర్’ కొత్తది కాదు. ప్రతి ఓటును పూర్తిస్థాయిలో పరిశీలించి బోగస్ ఓట్లు ఉండకుండా చూడాలి. అర్హుల పేర్లే ఓటర్ల జాబితాలో ఉండేలా చూడాలి. కొందరు రెండుమూడు చోట్ల ఓట్లు వేస్తున్నారు. అలా జరుగుకుండా ఒకే దగ్గర పేరు ఉండేలా చూడాలి. సెప్టెంబర్‌లో తుది ఓటర్ల జాబితా విడుదల చేస్తారు. అప్పటివరకు పార్టీ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలి. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరితో సభ్యత్వ నమోదు చేయించాలి. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది.
-ఎం.ఎన్.శ్రీనివాస్‌రావు, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పరిగి నియోజకవర్గ ఇన్చార్జి