కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆసరా పింఛన్లను రూ.4వేలకు పెంచుతామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అరకొర పింఛన్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధినేత కేసీఆర్ ఆసరా పెంచి లబ్ధిదారులకు కొండంత అండగా నిలిచారు. జిల్లాలో సుమారు 2 లక్షలకు పైగా లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అప్పట్లో రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.1000కి పెంచారు. రెండో విడుత అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రూ.2వేలకు పింఛన్‌ను పెంచి వృద్ధులకు భరోసానిచ్చారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఇచ్చిన పింఛన్లే ఇస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.4వేలు ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.
– షాబాద్, ఫిబ్రవరి 2
ఏడాదిగా ఎదురుచూపు !
జిల్లా వ్యాప్తంగా ఏడాదిగా పింఛన్ల పెంపు కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 25 మండలాల్లోని గ్రామాల్లో మొత్తం 2.08 లక్షల మంది ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వృద్ధులు, వితంతువులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.2016, దివ్యాంగులకు రూ.4016 పింఛన్‌ను పంపిణీ చేసింది. ఎన్నికల సమయంలో పింఛన్లను పెంచుతామని అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సంక్రాంతి పెంచిన పింఛన్లు వేస్తారేమోనని ఆశించినా లబ్ధిదారులకు నిరాశే మిగిలింది.
రూ.4 వేల పింఛన్ ఎప్పుడిస్తది..
కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 వేలు ఎప్పుడిస్తదో అర్థం కావడం లేదు. ఎన్నికలప్పుడు పింఛన్ పెంచుతామని చెప్పి మాట తప్పుతున్నరు. మాజీ సీఎం కేసీఆర్ ఠంచన్‌గా రూ.2 వేల 16 ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా పింఛన్ ఊసెత్తడం లేదు. అబద్దాలు చెప్పి గద్దెనెక్కారు. రాబోవు రోజుల్లో తగిన బుద్ధి చెబుతాం.
– బేగరి మల్లయ్య, అంతారం గ్రామం, చేవెళ్ల మండలం
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛన్ పెంచుతామని ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇస్తలేరు. ఇప్పటికీ కేసీఆర్ ఇచ్చిన రూ.2 వేల పింఛనే ఇస్తుండ్రు. కాంగ్రెసోళ్లు కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకుండ్రు. మళ్లీ ఎన్నికలొస్తే ఏ మొఖం పెట్టుకుని వస్తరు. కేసీఆర్ రూ. 2 వేలు ఇస్తే… మేం రూ.4 వేలు ఇస్తాం.. అంటూ గొప్పలు చెప్పుకున్నరు. గద్దెనెక్కగానే ముసలొళ్లం యాదిమరిచినమా.. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్‌ను పెంచాలి. లేదంటే గుణపాఠం తప్పదు.
– ఎండి.ఇబ్రహీం, సింగప్ప గూడ గ్రామం, చేవెళ్ల మండలం