జిల్లాకు మణిహారంగా మారనున్నదని భావించిన మొబిలిటీ వ్యాలీకి రాజకీయ గ్రహణం పట్టింది. భూసేకరణ పూర్తై ఏడాదిన్నర కావొస్తున్నా దానికి సంబంధించిన పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. వెనుకబడిన వికారాబాద్ జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం జిల్లాలో మొబిలిటీ వ్యాలీని 940 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందు కు అవసరమైన భూమిని కూడా సేకరించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు రావడం.. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు దాటినా ఇప్పటివరకు మొబిలిటీ వ్యాలీకి సంబంధించి ప్రస్తావించకపోవడం గమనార్హం.
-వికారాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ)
గత కేసీఆర్ ప్రభుత్వం వికారాబాద్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. అందుకోసం జిల్లాలో రూ. 50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేసేందుకు భూమిని కూడా సేకరించింది. దానిని అభివృద్ధి చేసే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచిపోయాయి. తదనంతరం డిసెంబర్ మొదటి వారంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు మొబిలిటీ వ్యాలీ అంశాన్ని చర్చించకపోవడంతో ఈ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మొబిలిటీ వ్యాలీ లో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చిన పలు కంపెనీలకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందా.. ? ఉండదా..? అనే ఆందోళన జిల్లా ప్రజల్లో మొదలైంది. అంతేకాకుండా గత ప్రభు త్వం జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన స్థలంలోనే ఉంటుందా..? లేదా మరో చోటుకు వెళ్తుందా..? అనే అనుమానాలు జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం పారిశ్రామిక రంగంలో టీఎస్ఐఐసీ, టీఎస్-ఐపాస్ వంటి నూతన శకానికి నాంది పలికి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించింది.
4 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా..
మోమిన్‌పేట మండలంలోని ఎన్కతలలో రూ.50,000 కోట్ల పెట్టుబడులతో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా గత కేసీఆర్ ప్రభు త్వం 940 ఎకరాల్లో మొబిలిటీ వ్యాలీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఎలక్ట్రిక్ వాహనాలు, విడి భాగాలను తయారు చేసే పరిశ్రమలను మొబిలిటీ వ్యాలీలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు అవసరమైన భూమిని రెండేండ్ల కిందటే సేకరించగా.. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు కూడా కొంతమేర పూర్తయ్యాయి. కాగా భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వం నష్టపరిహారా న్ని కూడా చెల్లించింది. ఎన్కతల గ్రామ పంచాయతీ సర్వేనంబర్ 174, 198 పరిధిలోని 636.11 ఎకరాల అసైన్డ్ భూములకు సంబంధించిన 400 మంది రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.17 లక్షల చొప్పున పరిహారాన్ని జమ చేసింది.
అదేవిధంగా అసైన్డ్‌దారుల కుటుంబాల్లోని అర్హులకు మొబిలిటీ వ్యాలీలో ఉద్యోగాలు కల్పించాలని, వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందు కు ప్రత్యేకంగా బాలురు, బాలికల రెసిడెన్షియల్ బడులనూ ఏర్పాటు చేయాలని గత ప్రభు త్వం నిర్ణయించింది. అయితే రేవంత్ ప్రభుత్వం అసైన్డ్‌దారులకు ఉద్యోగాలు, వారి పిల్లలకు రెసిడెన్షియల్ బడులు తదితర సౌకర్యాలు కల్పించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆందోళన భూములిచ్చిన కుటుంబాల్లో నెలకొన్నది. మరోవైపు మొబిలిటీ వ్యాలీతో స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తాయనే ఆశతో స్థానికులున్నారు. మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు కానున్న ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఎకరం ధర రూ. కోట్లకు చేరింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రాజెక్టు ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో భూముల ధరలు పడిపోవడంతోపాటు చుట్టుపక్కల పూర్తిగా క్రయవిక్రయాలు ఆగిపోయాయి.