బంట్వారం (కోట్పల్లి), జనవరి 22 : మండల పరిధిలోని కరీంపూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా సాగింది. అధికారుల సమన్వయం లోపించినట్లుగా కనిపించింది. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో చాల మంది పేర్లు జాబితాలో రాకపోవడంతో గందరగోళం నెలకొన్నది. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 217 మంది దరఖాస్తులు చేసుకోగా, కేవలం 110 మంది మాత్రమే అర్హులంటూ జాబితాను ప్రకటించారు.
దీంతో మిగిలిన 107 మంది తామెట్ల అర్హులం కాదో తెలుపాలని పట్టు బట్టారు. అర్హుల జాబితాలో పేర్లు రాకుంటే, అనర్హుల జాబితాను సైతం పెట్టాలని, వీటికి కారణాలు సైతం తెలియజేయాలని నిలదీశారు. అధికారులు సరైన సమాధానం చెప్పలేక విషయాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. ఏకంగా వందకుపైగా దరఖాస్తుదారుల వివరాలు ఏమయ్యాయని గ్రామస్తులు భగ్గుమన్నారు. చేసేదేమీ లేక మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించడంతో ఒక్కసారిగా ముందుగా ఎందుకు నిర్లక్ష్యం జరిగిందని ఆగ్రహించారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నాకు ఇద్దరు పిల్లలు.. పెండ్లి ఈడుకు వచ్చారు. ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్న. ప్రస్తుతం రేకుల షెడ్లో ఉంటున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. ఇదేనా ఇందిరమ్మ పాలన.. అంటే.. మాలాంటోళ్లకు ఇల్లు ఇవ్వకుండా తొత్తులుగా ఉండేటోళ్లకే ఇస్తారా..
– కావలి మొగులయ్య, కరీంపూర్ గ్రామం, మండలం
ప్రజా పాలన దరఖాస్తుల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి ఫొటోలు తీశాం. అయినా పూర్తిస్థాయిలో జాబితా రాలేదు. ఇంటి స్థలం ఉన్న లబ్ధిదారులు 68 మంది, ఇంటిస్థలం లేని అర్హులు 42 మంది పేర్లు మాత్రమే జాబితాలో వచ్చాయి. ఇంకా 107 మంది పేర్లు జాబితాలో ఎందుకు రాలేదో అర్థంకావడం లేదు.
– జయరాజ్, కార్యదర్శి
ఆర్థికంగా బాగా ఉండి.. కాంగ్రెస్ పార్టీలో తిరిగే వాళ్లకే ఇండ్లు వచ్చాయి. ఏ ఒక్క పేదవాడి పేరు లిస్టులో రాలేదు. ఇంతకన్నా దారుణం లేదు. గ్రామంలో కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తుండ్రు. జిల్లా, రాష్ట్ర లీడర్లు పేదలకు ఇండ్లు ఇవ్వొద్దు.. కార్యకర్తలకే ఇవ్వమని చెప్పినట్టున్నరు. ఇదేనా ప్రజాపాలన, కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకోవడం తప్ప.. పేదవాళ్లకు ఎలాంటి ప్రయోజనం లేదు.
– మాలావత్ అంబ్యానాయక్, మారేపల్లి తండా (పెద్దేముల్ మండలం)
ఒకే ఇద్దరికీ ఇండ్లు వచ్చాయి కానీ ఇల్లు లేనివారికి మాత్రం ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలే. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుండ్రు. కాంగ్రెస్ పార్టీలో తిరిగితేనే ఇల్లు ఇస్తరా.. ఇంతటి కుట్రలు, కుతంత్రాలు మంచివి కావు. రాబోవు రోజుల్లో గోస పడుతరు. ఓట్ల కోసం వస్తే ఉరికిచ్చి కొడుతం. ఏ ముఖం పెట్టుకుని మళ్ల వస్తరు. అర్హులకు పథకాలు అందకుండా అనర్హులకు ఇస్తే పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం న్యాయం చేసినట్లు. పేదల ఓట్లు కావాలెగాని వాళ్ల అవసరాలను మాత్రం గుర్తించరా.. ఇల్లులేని వారు ఎందరో ఉన్నారు.. ఇల్లు ఉన్నవారికే ఎందుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు. ఇప్పటికైనా పేదలను పట్టించుకోవాలి.
– భోజ్యానాయక్ , మారేపల్లి తండా (పెద్దేముల్ మండలం )