ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 6 : కంటిచూపు సరిగ్గాలేక ఇబ్బందులు పడుతున్న పేదప్రజల కండ్లలో వెలుగులు నింపడమే ధ్యేయమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో సోమవారం కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు పెద్ద ఎత్తున కంటిచూపు మందగించి, దూర ప్రాంతాలకు వెళ్లి చికిత్సలు చేయించుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యమ సమయంలో ఈ సమస్యలను గమనించి సీఎంకేసీఆర్ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా కంటిచూపు తక్కువై ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. కంటి పరీక్షలు చేసిన వెంటనే అవసరమైన వారికి మందులు అందజేయటంతో పాటు ఆపరేషన్లు నిర్వహించి కంటి అద్దాలు అందజేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ అశోక్‌వర్ధన్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్ మహేందర్‌రెడ్డి, ఎలిమినేడు వైద్యాధికారి నాగయ్య, వార్డుసభ్యులు బుట్టి మహేశ్ పాల్గొన్నారు.
పార్టీలకు అతీతంగా అభివృద్ధి
తుర్కయాంజాల్ : పార్టీలకు అతీతంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్‌రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర ఆదివారం రాత్రి మున్సిపాలిటీ పరిధిలోని కొహెడలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొహెడను రూ.60 కోట్లతో అభివృద్ధి చేశామని, 170 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడ మార్కెట్ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. అనంతరం ప్రగతి నివేదన యాత్ర ఉమర్ఖాన్గూడకు చేరింది. ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కల్యాణ్ నాయక్, కౌన్సిలర్లు జ్యోతి, స్వాతి, కీర్తన, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.