రంగారెడ్డి, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డిజిల్లా మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి ప్రాంతాల అన్నదాతల కలలను సాకారం చేయడం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించి కాల్వల నిర్మాణం పూర్తిచేయడంతో ఇటీవల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాగు నీరు మాడ్గులకు వచ్చింది. ముఖ్యంగా జిల్లాలోని పలు మండలాల్లో శాశ్వత సాగునీరు లేకపోవడంతో వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం పంటలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. కరువు జిల్లాగా పేరుపడిన మహబూబ్‌నగర్‌లో గతంలో భాగమైన మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ మండలాలకు శాశ్వత సాగునీరు అందించాలని గత ప్రభుత్వాలు కాల్వల నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేశాయి. ఇటీవల ఈ మండలాలు రంగారెడ్డిజిల్లా పరిధిలో విలీనమయ్యాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ ఈ కాల్వ నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కాల్వల నిర్మాణాన్ని పూర్తిచేయడానికి డీపీఆర్‌ను సిద్ధం చేశారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన జంగారెడ్డిపల్లి రిజర్వాయర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాడ్గుల మండలానికి సాగునీటి కోసం కాల్వల నిర్మాణానికి రూ.182 కోట్లు అవసరమవుతుందని భావించిన ప్రభుత్వం వెంటనే నిధులను కేటాయించింది. ఈ నిధులతో డిస్ట్రిబ్యూషన్ కెనాల్-82 నుంచి ప్రత్యేకంగా కాల్వను తీసుకురావాలని నిర్ణయించారు. ఈ కాల్వ జిల్లా పరిధిలోని ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల్ మండలంలోని కొంతభాగానికి సాగునీరు అందించే ఉద్దేశంతో కాల్వ పనులు ప్రారంభించారు. ఈ కాల్వ మాడ్గుల మండలంలోని నాగిళ్ల చెరువు వరకు తీసుకొచ్చి ఈ చెరువు ద్వారా ఇతర ప్రాంతాలకు సాగునీరు అందించాలని సదుద్దేశంతో పనులు ప్రారంభించారు. కాల్వ నిర్మాణ పనులు పూర్తికాగా.. ఇటీవల ఇరిగేషన్ అధికారులు ఈ కాల్వలకు నీటిని విడుదల చేశారు. కాల్వను ఆమనగల్లు మండలంలోని సింగంపల్లి, గన్నేభగత్తండా, పోలేపల్లి గ్రామాల మీదుగా మాడ్గుల మండలంలోని అవుర్పల్లి, దొడ్లపాడు మీదుగా నాగిళ్ల చెరువు వరకు సాగునీరు వచ్చింది.
గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినప్పటికీ కల్వకుర్తి ఎత్తిపోతల్లో భాగమైన మాడ్గుల మండలానికి సాగునీరు తీసుకురావడంలో పాలకులు విఫలమయ్యారు. ఈ ప్రాంతానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ జైపాల్‌రెడ్డి కూడా ఈ ప్రాంతానికి సాగునీరు తీసుకురావడంపట్ల సరైన శ్రద్ధ చూపలేదనే ఆరోపణలున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కాల్వ నిర్మాణం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ కాల్వ నిర్మాణంతో భూములు కోల్పోయిన రైతులకు కూడా పరిహారాన్ని అందజేశారు. కాల్వ నిర్మాణం కోసం అవసరమైన భూ సేకరణ సమయంలో రైతుల నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గత ప్రభుత్వాలు అసాధ్యమనుకున్నవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం సుసాధ్యం చేసి మాడ్గుల, ఆమనగల్లు మండలాలకు సాగునీరు తీసుకురావడంతో ఆ ప్రాంత అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము శాశ్వత సాగునీటి కోసం ఎదురుచూస్తున్నామని, గత ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో ఈ సమస్య పరిష్కారమైందని రైతులు భావిస్తున్నారు. ఈ కాల్వకు సాగునీరు రావడంతో వచ్చే యాసంగిలో కాల్వ పరిధిలోకి వచ్చే పలు గ్రామాల అన్నదాతలకు రెండు పంటలకు సాగునీరందనున్నది. ప్రస్తుతం వర్షాకాలంలో వేసిన పత్తి పంట పూర్తి కాగానే ఈ కాల్వ ద్వారా పంట పొలాలకు సాగునీరందించే వీలు కలుగుతుంది. దీంతో వచ్చే యాసంగిలో ఈ కాల్వ పరిసర గ్రామాల్లో వరి పంట వేసుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించడంతో ఈ కాల్వ నిర్మాణం పూర్తిచేశాం. ఈ కాల్వ నిర్మాణానికి రూ.182 కోట్ల నిధులు విడుదల చేసి.. భూ నిర్వాసితులకు పరిహారంతోపాటు కాల్వ తవ్వకం కూడా పూర్తిచేశాం. ఈ కాల్వ ద్వారా మాడ్గుల, తలకొండపల్లి, ఆమనగల్లు మండలాల్లో వ్యవసాయంపై ఆధారపడిన అన్నదాతలకు శాశ్వత సాగునీరు లభించనున్నది. ఈ ప్రాంత రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శాశ్వత సాగునీరు తీసుకురావాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ కాల్వకు నీరు రావడం ఎంతో సంతోషంగా ఉన్నది.
– మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత అన్నదాతలు శాశ్వత సాగునీరు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలు పడితేనే వ్యవసాయం ముందుకు సాగేది. ముందు వర్షాలు పడినప్పటికీ ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడం వలన పంట పొలాలు ఎండిపోవటంతో పాటు దిగుబడి కూడా సరిగ్గా వచ్చేది కాదు. దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూసేవారు. ఈ పరిస్థితిలో గత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ప్రాంతానికి శాశ్వత సాగునీరు అందించేందుకు చేపట్టిన కాల్వల నిర్మాణంతో సాగునీరు వచ్చింది. దీంతో అన్నదాతల కష్టాలు తీరనున్నాయి.
– నిరంజన్‌గౌడ్, దొడ్లపాడు
గత ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించి కాల్వల నిర్మాణం పూర్తిచేసింది. కాల్వల నిర్మాణ సమయంలో భూసేకరణకు అనేక అడ్డంకులు ఎదురయినప్పటికీ వాటిని అధిగమించి కాల్వల నిర్మాణం చేపట్టింది. ఈ ప్రాంతానికి శాశ్వత సాగునీరు రాదని భావిస్తున్న తరుణంలో కేసీఆర్ ప్రత్యేక నిధులను కేటాయించి కాల్వల నిర్మాణం త్వరితగతిన పూర్తికావడానికి చేసిన కృషి ఫలితంగా సాగునీరు అందింది.
– బండారు యాదయ్య, అవుర్పల్లి