యాచారం, మార్చి31: అర్హులైనవారందరికి కొత్త పింఛన్లను అందజేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలోని వికలాంగుల భవనంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జూన్ 2న కొత్తగా పంపిణీ చేసే పింఛన్లను గతంలో ధరఖాస్తు చేసుకొని పెండింగ్లో ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి పింఛన్ అందివ్వాని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం పంపిణీ చేసే 2లక్షల కొత్త పింఛన్లలో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు, వితంతువులకు, వృద్ధులందరికి తప్పనిసరిగా పింఛన్లను పంపిణీ చేయాలని కోరారు.
దరఖాస్తు చేసుకున్న అర్హులకు కొత్త పింఛన్లు రాకపోతే ఊరుకునేదిలేదన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే, వృద్ధులకు రూ.4016లు, దివ్యాంగులకు రూ.6016లు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా నేటికి పింఛన్ పెంచకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పింఛన్ పెంపు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను, వృద్ధులను తీవ్రంగా మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.
దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, లేదంటే వీహెచ్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగార్ఝున శ్రీనివాసచారి, జిల్లా అధ్యక్షుడు యాచారం జంగయ్య, తదితరులున్నారు.