సిటీ బ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి పాతలంలో పడేసింది. ఎన్నికల ముందు అలవికాని హామీల వర్షం కురిపించి అధికారంలోకి వచ్చింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రగల్భాలు పలికింది. నమ్మిన ప్రజలను నట్టేటా ముంచింది. ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. 420 హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఆరు గ్యారెంటీలను ఆరు మోసాలుగా మార్చింది. తెలంగాణలోని మహిళలందరికీ వంటింటి కష్టాలు తీర్చడానికి మహాలక్ష్మి పథకం కింద వంట గ్యాస్ సిలిండర్‌ను రూ.500 కే ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు. అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది.
కొద్ది మందికే జమ.. ఆపై బంద్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో మహాలక్ష్మి కింద రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని గప్పాలు కొట్టారు. రూ.900 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరలో రూ.400 సబ్సిడీ కింద లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. అదీ కొంత మందికే ఖాతాల్లో వేశారు. 420 హామీల్లో కనీసం ఒక్కటైనా అమలు చేశారని తెలంగాణ మహిళలు సంబర పడ్డారు. ఈలోపే వారి ఆశలను ఆవిరి చేశారు. కాంగ్రెస్ మంత్రుల ప్రకటనలు, గొప్పలు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు రెండు నెలల తర్వాత సబ్సిడీ నగదు జమ చేయడం పూర్తిగా నిలిపేశారు. పథకాన్ని అనధికారికంగా పక్కన పెట్టేశారు. దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది లబ్ధిదారులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాంగ్రెస్‌పై మహిళల ఆగ్రహం..
కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలన్నింటినీ కొనసాగించడకుండా ఆపేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండ్లి చేసుకున్న వారం రోజుల్లోనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద రూ.లక్ష ఆడబిడ్డల ఖాతాల్లోకి చేరేవి. కానీ రెండేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలల తరబడిగా ఎదురు చూడాల్సి వస్తున్నదని ఆవేదన చెందుతున్నారు. రెండు పథకాలకు అదనంగా తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు ధర పెరిగిందని కుంటి సాకులు చెబుతున్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి మహిళకు రూ.2500 పింఛన్ ఇస్తామని చెప్పి మోసం చేశారు.
సబ్సిడీ మూడు నెలలే వచ్చింది
మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు మూడు నెలలు ఖాతాలో జమయ్యాయి. ఆ తర్వాతి నుంచి రావడం లేదు. గ్యాస్ ఏజెన్సీ వారిని అడిగితే ప్రభుత్వం ఇవ్వడం లేదని, తమనేం చేయమంటారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు ఒరిగిందేమీ లేదు. ఇస్తామని చెప్పిన పథకాలేవీ అమలు చేయలేదు. ఈ పథకం ద్వారా కొంత డబ్బు ఆదా అవుతుందని అనుకున్నం. రెండేండ్ల నుంచి కాంగ్రెస్ మహిళలకు చేసింది సున్నా. ప్రచారానికి వచ్చినప్పుడు నిలదీద్దామంటే వాళ్లు ఆగకుండా వెళ్లిపోతున్నారు. – తమ్మలి పారిజాతం, గృహిణి, షేక్‌పేట