జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. రెగ్యులరైజ్ కల సాకారం కాబోతున్నందుకు వారిలో ఆనందం వెల్లివిరుస్తున్నది. రెగ్యులరైజ్ ప్రక్రియకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా జేపీఎస్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి జేజేలు పలుకుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అయితే జేపీఎస్‌ల పనితీరు మదింపునకు రాష్ట్ర సర్కార్ కలెక్టర్ల నేతృత్వంలో కమిటీలనూ నియమించింది. త్వరలో విధివిధానాలకు రూపకల్పన చేయనున్నది. దీంతో వికారాబాద్ జిల్లాలోని 420 మంది జేపీఎస్‌లకు ప్రయోజనం చేకూరనుండగా, రంగారెడ్డి జిల్లాలో 306 మందికి లబ్ధి కలుగనున్నది. పల్లె ప్రగతి, హరితహారం, నర్సరీల పెంపకం, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించినందుకు ఫలితం దక్కుతున్నదని జేపీఎస్‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– షాబాద్/బొంరాస్‌పేట, మే 23
బొంరాస్‌పేట, మే 23 : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగేండ్ల కల నెరవేరబోతున్నది. వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జేపీఎస్‌ల రెగ్యులరైజ్‌పై సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న 5544 మంది ఉద్యోగులను ఇటీవలే ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. గత వారం కిందట రెవెన్యూ శాఖలో పని చేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులను(వీఆర్ఏలు) కూడా ప్రభుత్వం క్రమబద్ధీకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని ఉద్యోగులపై తనకున్న దయాగుణాన్ని నిరూపించుకున్నారు.
ఇందులో భాగంగా జేపీఎస్‌ల పనితీరును మదింపు చేయడానికి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీని ప్రభుత్వం నియమించింది. క్రమబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు కూడా త్వరలో విడుదల కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో 420, రంగారెడ్డి జిల్లా 306 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ప్రయోజనం కలుగనుంది. కేసీఆర్ నిర్ణయంతో జేపీఎస్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి, తెలంగాణకు హరితహారం, నర్సరీల పెంపకం, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల పర్యవేక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకం. ప్రతినిత్యం గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. పల్లెప్రగతి పనులను విజయవంతంగా నిర్వహించినందుకు జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు అవార్డులు దక్కించుకున్నాయి.
జిల్లాలో 420 మంది జేపీఎస్‌లు
వికారాబాద్ జిల్లాలో 566 గ్రామపంచాయతీలుండగా వీటిలో 137 గ్రామాలకు రెగ్యులర్ గ్రామపంచాయతీ కార్యదర్శులున్నారు. 2019లో జిల్లాస్థాయిలో నిర్వహించిన పరీక్షల ద్వారా 420 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు నియమితులయ్యారు. కొందరు తమ వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగాలను వదిలి వెళ్లారు. వీరి స్థానాల్లో రాత పరీక్షలో తర్వాతి స్థానాల్లో ఉన్నవారిని కలెక్టర్ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 9 మందిని నియమించారు. వీరికి ప్రభుత్వం నాలుగేండ్ల ప్రొబేషనరీ కాలాన్ని నిర్ణయించగా ఇటీవలే అది పూర్తయింది. జేపీఎస్‌లకు ప్రభుత్వం ప్రతి నెలా వేతనంగా రూ.28,719 చెల్లిస్తున్నది. సర్వీసు క్రమబద్ధీకరణ నిర్ణయంతో వేతనం పెరగడంతోపాటు రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే అన్ని సదుపాయాలు అందనున్నాయి. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న గ్రామ సహాయకుల(వీఆర్ఏలు)ను కూడా క్రమబద్ధీకరించాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల వికారాబాద్ జిల్లాలో పని చేస్తున్న 863 మంది వీఆర్ఏల సర్వీసు రెగ్యులరైజ్ అవుతుంది. క్రమబద్ధీకరణలో భాగంగా ప్రభుత్వం జిల్లాలోని అన్ని మండలాల్లో పని చేస్తున్న వీఆర్ఏల వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది.
జేపీఎస్‌ల రెగ్యులర్ సంబురం
షాబాద్, మే 23 : జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జేపీఎస్‌లను రెగ్యులరైజేషన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే అనేక వర్గాల సంక్షేమానికి కృషి చేసిన సీఎం తాజాగా జేపీఎస్‌లను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాల్లో 306 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. గత కొద్ది రోజులుగా తమను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వానికి విన్నవించగా వారి సమస్యను గుర్తించిన ప్రభుత్వం వారికి తీపి కబురు చెప్పింది. తమ పట్ల అనుకూలంగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు క్షీరాభిషేకాలు నిర్వహించి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజేషన్ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంతో మంగళవారం షాబాద్ మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చంద్రకాంత్, హరిశంకర్, అజీమ్, విజయభాస్కర్, రాంచంద్రారెడ్డి, లింగం, యాదగిరి, ప్రవీణ్, సుల్తానా, నాగశ్రీ ఉన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి
కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగుల పక్షపాతి అని, ఇచ్చిన మాట ప్రకారం జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్‌ను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ఎంపీపీ కమ్లీమోత్యానాయక్, జడ్పీటీసీ దశరథ్‌నాయక్ అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్‌ను క్రమబద్ధీకరించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో, మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి జేపీఎస్‌లతో కలిసి ప్రజాప్రతినిధులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. గ్రామపంచాయతీల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన జేపీఎస్‌లను పర్మినెంట్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హర్షణీయమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట తప్పని మహానేత అని నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఆనంద్, సర్పంచ్ హరిచంద్‌నాయక్, ఎంపీడీవో రామకృష్ణ, ఏంపీవో మధుసూదనాచారి, ఏపీవో లలిత, నాయకులు శ్రీనివాస్, గణేశ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఆనందంగా ఉంది : సిద్ధయ్య, జూనియర్ పంచాయతీ
కార్యదర్శి, మెట్లకుంట, బొంరాస్‌పేట
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించాలని నిర్ణయించడం సంతోషం. మా పట్ల సానుకూల నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. గ్రామాల్లో ప్రతినిత్యం పారిశుధ్య నిర్వహణలో, గ్రామాల అభివృద్ధికి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. మా కష్టాన్ని గుర్తించిన కేసీఆర్ సముచిత నిర్ణయం తీసుకున్నారు.
కేసీఆర్‌కు కృతజ్ఞతలు : జైపాల్,
జూనియర్ పంచాయతీ కార్యదర్శి, దుద్యాల, బొంరాస్‌పేట మండలం
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు. ప్రభుత్వ నిర్ణయంపై పంచాయతీ కార్యదర్శులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథంతో ఉందనడానికి ఈ నిర్ణయమే ఉదాహరణ. ప్రొబేషనరీ కాలాన్ని సర్వీసు కాలంగా లెక్కించాలని కోరుతున్నాం.
కుటుంబాలకు భరోసా : రాఘవేందర్‌గౌడ్,
పంచాయతీ కార్యదర్శి, బ్రాహ్మణపల్లి, దోమ మండలం
జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సర్వీసు క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు జూనియర్ పంచాయితీ కార్యదర్శులతో పాటు వారి కుటుంబాలకు చెందిన వ్యక్తులు జీవిత కాలం రుణపడి ఉంటారు. కార్యదర్శులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన కేసీఆర్ మా సర్వీసును క్రమబద్ధీకరణ చేస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయం.
సీఎం తీసుకున్న నిర్ణయం ముదావహం
– శేఖర్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి, న్యాలట, చేవెళ్ల
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరణ చేసేందుకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వం తమను గుర్తించినందుకు మరింత సంతోషంగా ఉంది. రెగ్యులరైజ్ చేసి మా జీవితాల్లో వెలుగులు నింపారు. రెట్టింపు ఉత్సాహంతో పని చేసి గ్రామాలను మరింత పటిష్టపరిచేందుకు కృషి చేస్తాం.
కేసీఆర్‌కు కృతజ్ఞతలు : ఉమామహేశ్వరి,
జూనియర్ పంచాయతీ కార్యదర్శి, దొంతాన్పల్లి, శంకర్పల్లి
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్ధీకరించినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. రాష్ట్రం వచ్చిన తర్వాతనే ప్రభుత్వ ఉద్యోగం సాధించా. సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో రకాలుగా ప్రోత్సాహమిస్తున్నారు. సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయి.
సంతోషంగా ఉంది : రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి, మోత్కుపల్లి, మొయినాబాద్ మండలం
ప్రభుత్వం మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించినందుకు చాలా సంతోషంగా ఉంది. కొన్ని రోజులుగా క్రమబద్ధీకరించాలని ఆందోళన చేశాం. మా గోడును వినిపించాం. కేసీఆర్ పెద్ద మనస్సు చేసుకుని మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించారు. రెగ్యులరైజ్ చేసి మా జీవితాల్లో వెలుగులు నింపారు. గ్రామాల అభివృద్ధి కోసం కష్టపడి పని చేస్తాం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి చేరువయ్యేలా చేస్తాం.