‘కొలువు’దీరడమే మీ లక్ష్యమైతే.. ప్రణాళికాబద్ధమైన కృషితో .. గెలుపు వరిస్తుందని.. పలువురు వక్తలు ఉద్యోగార్థులకు సూచించారు. పరిగిలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల ఆధ్వర్యంలో, స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సౌజన్యంతో మంగళవారం ‘కొలువు-గెలువు’ పేరుతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, వికారాబాద్ కలెక్టర్ నిఖిల, ప్రధాన వక్తలుగా సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ బాలలత, వేప అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సీఎస్ వేప హాజరై అభ్యర్థులకు మార్గనిర్దేశం చేశారు. ప్రణాళికాబద్ధంగా చదివితే కొలువు సాధించడం సులువేనన్నారు. ముందుగా పోటీ పరీక్షలంటే భయాన్ని, ఆందోళనను మనసులో నుంచి పారదోలాలన్నారు. పదే పదే లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ.. ఎన్ని అడ్డంకులొచ్చినా అధిగమిస్తూ ముందుకు సాగాలన్నారు. ఎప్పటికప్పుడు ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకొని వీలైనప్పుడల్లా రివిజన్ చేస్తుండాలన్నారు. ప్రత్యేక టైమ్ టేబుల్ ఏర్పాటు చేసుకొని ఏ సమయంలో ఏ సబ్జెక్ట్ చదువాలన్నదానిపై ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. నిత్యం దినపత్రికలను చదువాలన్నారు. దీంతో కరెంట్ ఎఫైర్స్‌పై పట్టు సాధించడంతోపాటు 50శాతం సిలబస్‌ను కవర్ చేయవచ్చునన్నారు. అభ్యర్థుల ప్రయోజనార్థం సదస్సు నిర్వహించినందుకు ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’లకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు.
పరిగి, జూన్ 14 : ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ప్రణాళికాబద్ధంగా చదువాలని వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన సదస్సులో వక్తలు సూచించారు. పోటీ పరీక్షలు రాసేవారు ముందుగా మనసులో నుంచి ఆందోళనలు, భయాలు పారదోలాలని చెప్పారు. మరుసటి రోజు ఏది చదవాలో ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని, అప్పుడే అంశాల వారీగా అన్నింటిపై పట్టు లభిస్తుందన్నారు. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సౌజన్యంతో మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగిలోని కొప్పుల శారద గార్డెన్-2లో ఉద్యోగార్థుల కోసం ‘కొలువు-గెలువు’ అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ సదస్సులో ఆత్మీయ అతిథులుగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల, ప్రధాన వక్తలుగా సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ బాలలత వల్లవరపు, వేప అకాడమీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ సీ.ఎస్.వేప పాల్గొని మార్గనిర్దేశం చేశారు. సదస్సు ప్రారంభం నుంచి ఆద్యంతం ఉద్యోగార్థులు చాలా ఆసక్తిగా వక్తల ప్రసంగాలు విన్నారు. అలాగే పలు అంశాలను స్వయంగా ఆచరించేందుకు నోటు పుస్తకాలలో రాసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరిగి ఎంపీపీ కె.అరవిందరావు, నమస్తే తెలంగాణ హైదరాబాద్ ఎడిషన్ ఇన్చార్జీ చిరంజీవిప్రసాద్, ఈవెంట్స్ మేనేజర్ గణేశ్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కె.బాల్‌రాజ్, ఉద్యోగార్థులు తదితరులు పాల్గొన్నారు.
అత్యధిక ఉద్యోగాలు సాధిస్తేనే సంతృప్తి
పరిగి ప్రాంత అభ్యర్థులు అత్యధిక ఉద్యోగాలను సాధిస్తేనే నాకు సంతృప్తి కలుగుతుంది. జిల్లాలోనే ఎక్కువ ఉద్యోగాలు పరిగి ప్రాంతం వారికి రావాలన్నది ఆకాంక్ష. దేశంలో ఎక్కడా లేనివిధంగా, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాల ప్రకటన చేసిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. నీళ్లొచ్చాయి, నిధులొచ్చాయి, ఇప్పటికే లక్షా 30వేల పైచిలుకు ఉద్యోగ నియామకాలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి 90 వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభించింది. భారీ ఉద్యోగ ప్రకటనతో ఉద్యోగార్థుల కోసం ఉచిత కోచింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లా పరిధిలోని పోస్టులు ఆయా జిల్లావాసులకే 95శాతం దక్కేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది. ఇలాంటి అవగాహన సదస్సుల నిర్వహణ ద్వారా అభ్యర్థుల్లో మరింత విశ్వాసం పెంపొందుతుంది. వక్తల మార్గనిర్దేశం తూచ తప్పకుండా ఆచరిస్తే ఉద్యోగాలు సాధించవచ్చు.
– కొప్పుల మహేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే, పరిగి
సంకల్పం, సాధనతో నే విజయం
సంకల్పంతో సాధన చేస్తే పోటీ పరీక్షల్లో విజయం మనదే. ఈ ఆరు నెలలు నీకోసం సమయాన్ని కేటాయించుకొని ప్రణాళికాబద్ధంగా చదువుకుంటే విజయం సిద్ధిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలంటే సిలబస్‌తో పాటు గతంలోని పరీక్షా పేపర్లను తప్పకుండా చదువాలి. ఏ పోటీ పరీక్షలోనైనా నాలుగు అంశాలు ముఖ్యంగా గుర్తించుకోవాలి. ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ అంశాలు ఉంటాయి. అంశాలుగా చదివిన ప్రతి సబ్జెక్టులో సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే రాసింది గుర్తుంచుకోవడంతోపాటు చదువుకోవడానికి సులభంగా ఉంటుంది. బడ్జెట్, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్రపై అధికంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పర్యావరణం, జీవవైవిధ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, రోబోటెక్, నానో టెక్నాలజీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించిన అంశాలను తప్పక చదవాలి. కరెంటు ఎఫైర్స్, వ్యవసాయ పథకాలు అవపోసన పట్టుకోవాలి. దినపత్రికలు రోజూ చదువుతుండాలి. నమస్తే తెలంగాణ దిన పత్రిక ప్రతిరోజూ నిపుణ ప్రత్యేక సంచికలో పోటీ పరీక్షలకు సంబంధించి ఎన్నో అంశాలను క్షుణ్ణంగా ప్రచురిస్తున్నారు. అదేవిధంగా ప్రతి బుధవారం ప్రత్యేక సంచికనూ అందిస్తుంది. నిపుణలో అందించే పోటీ పరీక్షల విజ్ఞానాన్ని అన్ని రంగాల్లో ఎంతో అనుభవం ఉన్న నిపుణులు అంశాలను ప్రచురిస్తున్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదువుకుంటూ దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించుకోవాలి.
– బాలలత వల్లవరపు, సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్
అన్ని సబ్జెక్టులను సమానంగా చదవాలి
సివిల్స్‌లో రాణించడమే లక్ష్యంగా ప్లాన్ చేసుకొని, ఎంచుకున్న సబ్జెక్టులను సమానం చేసి ప్రిపేర్ కావాలి. చదివే సమయంలో లాంగ్, షాట్ ప్లానింగ్ ఉండాలి . పోటీ పరీక్షలు యుద్ధం లాంటిది. ముఖ్యంగా సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే సమయంలో బ్రెయిన్‌కు పని చెప్పడంతో పాటు కష్టపెట్టకుండా ప్రశాంతత ఇవ్వాలి. ఇందుకుగాను రోజు వారీ ప్రణాళికను తయారు చేసుకోవాలి. ఎన్ని గంటలు చదవాలి? ఏ సమయానికి ఏ పని చేయాలో నిర్ధారణకు రావాలి. ఈ రోజు చదివిన వాటితో పాటు రేపటి ప్రణాళికను ముందురోజే తయారు చేసుకోవాలి. చదివిన ప్రతి అంశాన్ని పడుకునే సమయంలో మనసులో రివైజ్ వేసుకోవాలి. రేపు ఏ పని చేయాలో కూడా మెదడుకు ముందుగానే తెలియజేయాలి. రోజు కు ఒక గంట పాటు విశ్రాంతి తీసు కోవాలి. చదివే సమయంలో టైమ్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా పాటించాలి. సుమారుగా గంట పాటు చదవాలనుకుంటే 50 నిమిషాల పాటు చదవి 5 నిమిషాలు రివిజన్, 5 నిమిషాలు వాకింగ్ చేయాలి
– డాక్టర్ సీఎస్ వేప, వేప అకాడమీ, డైరెక్టర్, హైదరాబాద్
లక్ష్యం దిశగా పయనించాలి
ఉద్యోగార్థులు లక్ష్యం దిశగా పయనిస్తే సులభంగా జాబ్‌ను సాధించవచ్చు. నేను 2009లో గ్రూప్ 1 రాయగా మొదటిసారిగా విజయం సాధించాను. సుమారుగా 20 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే, కేవలం 503 మంది మాత్రమే ఉద్యోగాలు సాధిస్తారు. చదువుతో పాటు ముఖ్యమైన అంశాలను నోట్ పుస్తకంలో రాసుకోవాలి. వాటిని పదే పదే గుర్తు చేసుకోవాలి. పరుగు పందెంలో అందరూ ఒకే దగ్గర ప్రారంభించినా వేగంగా పరిగెత్తేవారు మాత్రమే గెలుస్తారు. చదువుకు ధనిక, పేద అనే తేడా ఉండదు. కష్టపడి చదివే వారు గొప్ప వారు అవుతారు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఈ ప్రాంత అభ్యర్థులు అధిక ఉద్యోగాలు సాధించి పరిగి, వికారాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకరావాలి.
– నిఖిల, జిల్లా కలెక్టర్, వికారాబాద్
వికారాబాద్ కలెక్టర్ నిఖిలకు చీర పెట్టి సన్మానిస్తున్న ఉద్యోగార్థులు
బట్టీకి స్వస్తి పలకాలి
సివిల్స్, గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే వారు తప్పనిసరిగా బట్ట్టీ విధానాన్ని అనుసరించకూడదని తెలుసుకున్నాను. బట్టీవిధానంతో నేర్చుకున్న అంశం మరిచిపోయే ప్రమాదం ఉంది. వివిధ అంశాలను చదివి వాటిపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి అనే అంశాన్ని నేర్చుకున్నాం.ఈ సదస్సును నిర్వహించిన నమస్తే తెలంగాణ, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డికి కృతజ్ఞతలు.
– అశ్విని, పుడుగుర్తి, పూడూరు మండలం
భయాలు తొలగిపోయాయి
ఉద్యోగ నియామకాలు పెద్ద ఎత్తున చేపడుతుండడంతో ఏ ఉద్యోగానికి ఎలా ప్రిపేర్ కావాలనే అంశంపై అవగాహన సదస్సు ద్వారా ప్రయోజనం కలిగింది. నిపుణుల సూచనలు ఉద్యోగాల సాధనలో చాలా వరకు ఉపయోగపడతాయి. ఇన్నాళ్లుగా ఉన్నటువంటి భయాలు తొలగిపోయాయి. దీంతో ఇబ్బంది లేకుండా పరీక్షలు రాయనున్నాం.
– రమేశ్, అంతారం, కులకచర్ల
అవగాహన సదస్సుతో భరోసా
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దిన పత్రికలు నిర్వహించిన కొలువు గెలువు అవగాహన సదస్సుతో భరోసా కలిగింది. ఎన్నో సందేహాలకు ఈ సదస్సు ద్వారా సమాధానాలు దొరికాయి. చదువుకు టైమ్ మేనేజ్మెంట్ ముఖ్యమని తెలిసింది. ఈ అవగాహన సదస్సుకు ముందు ఎన్నో అంశాలపై ప్రశ్నలు ఉండేవి. నగరానికి వెళ్లి కోచింగ్ తీసుకునేందుకు స్థోమత లేకుండే ఎమ్మెల్యే సహకారంతో 60 రోజుల పాటు ఉచిత కోచింగ్ పొందుతున్నాం. ఉచిత కోచింగ్‌తో పాటు అవగాహన సదస్సు నిర్వహించడం సంతోషంగా ఉంది.
– జ్యోతి, అన్నారం గడ్డ, పూడూరు
ఉద్యోగాల సాధనకు ఉపయోగం
ఉద్యోగాల సాధనకు ఈ అవగాహన సదస్సు ఎంతో ఉపయోగకరం. సులభతరమైన పద్ధతిలో చదవడం, వాటిని ఎలా గుర్తుంచుకోవాలి అనే అంశాలపై అవగాహన కలిగింది. ప్రాథమిక స్థాయిలోని తరగతులకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు చదువడం ద్వారా ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు సూచించారు.
– కే. కృష్ణవేణి, షాద్‌నగర్
నమ్మకం వచ్చింది
ఉద్యోగ నోటిఫికేషన్ రాగానే ఎలా చదవాలి, ఏమేమి చదవాలనే భయాందోళన నెలకొన్న తరుణంలో పరిగిలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సహకారంతో అవగాహన సదస్సు ఏర్పాటు హర్షణీయం. సదస్సులో నిపుణుల సలహాలు, సూచనలు, మెళకువలు విన్న తర్వాత ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం వచ్చింది.
– అరవింద్, గాదిర్యాల, గండీడ్ మండలం
నెగిటివ్ మార్కుల గురించి తెలిసింది
సదస్సుకు హాజరవ్వడం ద్వారా పోటీ పరీక్షలలో నెగెటివ్ మార్కుల విషయం తెలిసింది. గెస్ చేసిన వాటిని మార్కింగ్ చేయడం ద్వారా నెగిటివ్ మార్కులు వస్తాయి. అలాంటి వాటిని టచ్ చేయకుండా ఉంటే మంచిదని అర్థమైంది.
– మంజుల, తిర్మలాపూర్, కులకచర్ల మండలం
నిపుణతో నైపుణ్యం
నమస్తే తెలంగాణ ప్రచురిస్తున్న నిఫుణతో నైపుణ్యం పెరుగుతుంది. తమకు ఉన్న సందేహాలు నిపుణ పేపర్లో చదువుకొని పరిష్కారం తెలుసుకుంటున్నాం. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో పోటీ పరీక్షలను సులువుగా రాసే విధంగా నిపుణులు సూచించడం సంతోషంగా ఉంది.
– శ్రీకాంత్, కామునిపల్లి, కులకచర్ల
సందేహాలు
ప్రశ్న: గ్రూప్స్ ప్రిపరేషన్‌కు ఎన్ని గంటలు చదవాలి?
–బాలకృష్ణ, ఇప్పాయిపల్లి, కులకచర్ల మండలం
బాలలత: గ్రూప్స్‌కు ప్రతిరోజూ కనీసం ఎనిమిది గంటలు చదవాలి. రోజువారీ ప్రణాళికను తయారు చేసుకొని దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. చదివిన అంశాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్ చేసుకోవాలి.
ప్రశ్న: సెల్‌ఫోన్ వాడకాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి..?
– మహ్మద్ ఫిరోజ్, పరిగి
డాక్టర్ సీఎస్ వేప : ఒకేసారి కాకుండా విడుతల వారీగా తగ్గించేందుకు అలవాటు చేస్తే సెల్‌ఫోన్ వాడకాన్ని తగ్గించవచ్చు. చదువుతో పాటు మధ్యలో కొంత సమయాన్ని ఎంటర్టైన్మెంట్ కోసం కేటాయించాలి. ఆటలు, పాటల ద్వారా కూడా ఎంటర్టైన్మెంట్ పొందవచ్చు.