వికారాబాద్, నవంబర్ 13 : పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గ్రూప్-3 పరీక్షలో ఎలాంటి తప్పులకు తావీయకుండా సజావుగా జరిగేలా విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అధికారులకు సూచించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించే గ్రూప్-3 పరీక్షలకు సంబంధించి చేపట్టాల్సిన విధులు, జాగ్రత్తలపై బుధవారం ఉన్నతాధికారులతో కలిసి కమిషన్ చైర్మన్ మహేందర్‌రెడ్డి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, కలెక్టర్ కార్యాలయ సముదాయంలో పనిచేస్తున్న చీఫ్ సూపరింటెండెంట్స్, రూట్ ఆఫీసర్స్, బయోమెట్రిక్ అధికారులు, పరిశీలకులు, ఇన్విజిలేటర్లు, శిక్షణ పొందుతున్న అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు, మార్గదర్శకాలను అందించారు.
అనంతరం అధికారులను ఉద్దేశించి అదనపు కలెక్టర్ సుధీర్ మాట్లాడుతూ.. జిల్లాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 పరీక్షలకు 10,196 మంది అభ్యర్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్షల నిర్వహణకు 31 కేంద్రాలను గుర్తించగా అందులో వికారాబాద్ మండలంలో 14, తాండూరులో 11, పరిగిలో 5, పూడూరు మండలంలో ఒక కేంద్రంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇలాంటి కీలకమైన పరీక్షను సవాల్‌గా తీసుకొని అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. విధులు నిర్వహించే అధికారులు ఎలాంటి తప్పిదాలు చేసినా తీవ్రమైన చర్యలు ఉంటాయనే విషయాన్ని గుర్తించాలన్నారు. ఇప్పటికే పరీక్ష విధులకు కేటాయించిన అధికారులకు ఎలాంటి మినహాయింపు ఉండదని తెలిపారు.
పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించి పరీక్ష కేంద్రాల్లోకి పంపించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పూర్తి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. మహిళా అభ్యర్థులను తనిఖీ చేసే క్రమంలో కచ్చితంగా మహిళా సిబ్బంది, మహిళా పోలీసులు ఉండాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రానికి గంట ముందే రావడానికి సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ అభ్యర్థులకు సూచించారు. గ్రూప్-3 పరీక్షలు నవంబర్ 17న రెండు విడతలుగా పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు, అదేవిధంగా రెండో విడత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 18న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 ఉంటుందన్నారు. పరీక్షా సమయానికి గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వచ్చేలాగా ప్రణాళికతో ఉండాలని ఆయన సూచించారు. వీడియో కాన్ఫరెన్స్, శిక్షణా కార్యక్రమంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీజినల్ కోఆర్డినేటర్లు అరవింద్‌రెడ్డి, నరేంద్రబాబు, డీఎస్పీ జానయ్య, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ నేహమత్అలీ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్..
గ్రూప్-3 పరీక్షకు సంబంధించి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ తెలిపారు. పరీక్షలకు 10196 మంది అభ్యర్థులు హాజరవుతుండగా, 31 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే నవంబర్ 14 నుంచి 18 వరకు ఉదయం 8 నుంచి రాత్రి 10 గంటల వరకు 08416235291 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.