అభయహస్తం పథకం కింద ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులతో ప్రజాపాలనపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలన్న సదుద్దేశంతోనే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని, అభయహస్తం పథకం దరఖాస్తులు అందుబాటులో ఉండేలా సంబంధిత అధికారులు చూడాలని ఆదేశించారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించాలన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారి కోసం తెల్లకాగితంపై దరఖాస్తులు రాయించుకుని వారికి రసీదులు ఇవ్వాలని రెవెన్యూ, ఇతర శాఖల అధికారులకు మంత్రి సూచించారు. ప్రజాపాలన కార్యక్రమ విజయవంతానికి కృషి చేస్తున్న ప్రభుత్వ అధికారులను మంత్రి అభినందించారు.
– ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 30
ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 30 : ప్రతి నిరుపేద కుటుంబానికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రజాపాలన సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని తీసుకువచ్చిందన్నారు. ప్రజాపాలన ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్నదన్నారు.
తమ ప్రభుత్వం దళారీల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పాలిస్తున్నదన్నారు. అభయహస్తం పథకం దరఖాస్తులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవడానికి వచ్చేవారికి ఉచితంగా దరఖాస్తు ఫారాలు అందజేస్తున్నామన్నారు. కొంతమంది దరఖాస్తులను జిరాక్స్‌లు చేసి అమ్ముకోకుండా జిరాక్స్ కేంద్రాల వారికి అవగాహన కల్పించాలని, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించాలన్నారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీల పథకాలను అందించేందుకు అధికారులంతా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీలు అమలు చేశామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్యసేవల పరిమితిని ఐదు నుంచి పది లక్షలకు పెంచామన్నారు.
మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, గృహజ్యోతి పథకాలకు ప్రతి కుటుంబం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. రేషన్ కార్డుల కోసం వచ్చే వారి కోసం తెల్ల కాగితంపై దరఖాస్తులు రాయించుకుని వారికి రసీదులు అందించాలని రెవెన్యూ, ఇతర అధికారులకు మంత్రి సూచించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శాసనసభ్యులు, స్పెషల్ అధికారులను ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించే సమయంలో ఎదుర్కొనే సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్లు జిల్లాలోని ప్రజాపాలన వివరాలను మంత్రికి తెలియజేశారు.
ఎక్కడా దరఖాస్తులందలేదు అనే సమస్య రాకుండా చూసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజాపాలనలో ప్రభుత్వ అధికారుల కృషిని మంత్రి అభినందించారు. సమావేశంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల చైర్పర్సన్లు అనితారెడ్డి, సునీతారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, సుధీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ఈర్లపల్లి శంకర్, కసిరెడ్డి నారాయణరెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు గౌతమ్, నారాయణరెడ్డి, లోకల్ బాడీల అదనపు కలెక్టర్లు రాహుల్‌శర్మ, అభిషేక్, సైబారాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్, ఆర్డీవోలు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.