షాద్‌నగర్, నవంబర్ 5: తెలంగాణ ప్రజల సత్తా ఏమిటో ఈ నెల 30న గుజరాత్, ఢిల్లీ సామంతులకు తెలుస్తుందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఆదివారం రాత్రి షాద్‌నగర్ పట్టణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వై. అంజయ్యయాదవ్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల రోడ్డు షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. 2014, 2018 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి గెలిచామని, మరోమారు గెలిచి మన సత్తా ఏమిటో ఢిల్లీ, గుజరాత్ గుంపునకు తెలుపుదామని అన్నారు. అంజయ్యయాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మొదటి నుంచి తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్న పార్టీలను ఎట్టిపరిస్థితిలోనూ నమ్మొద్దని, తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణను ఆగంచేసింది ఢిల్లీ దొరలు కాదా ? అని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే మనం నష్టపోతం అని ముచ్చట్లు చెప్పిన నాయకులకు తెలంగాణ అభివృద్ధి కండ్లకు కనిపిస్తలేదా ? అని ప్రశ్నించారు. సాగునీరు, కరెంట్, మంచి నీళ్లు వంటి ఎన్నో వసతులు వచ్చాయని, రానున్న రోజుల్లో పాలమూరు ఎత్తిపోతల ద్వారా షాద్‌నగర్ భూములకు నీళ్లు పారుతాయని స్పష్టం చేశారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే షాద్‌నగర్ ప్రాంతంలో ఐటీ పరిశ్రమలను నెలకొల్పుతామని హామీఇచ్చారు. గిరిజనుల కోరిక మేరకు అనువైన ప్రతిచోట సేవాలాల్ మందిరాలను నిర్మించేందుకు తమవంతుగా కృషిచేస్తామని అన్నారు.
నరేంద్రమోదీ సిలిండర్ ధరలు పెంచితే సీఎం కేసీఆర్ రూ. 400 లకే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తారని చెప్పారు. రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాలుగు మెడికల్ కళాశాలలను నిర్మించిన ఘనత కూడా బీఆర్ఎస్కే దక్కిందని చెప్పారు. మంత్రి కేటీఆర్ రోడ్డు షోకు షాద్‌నగర్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీష్వ కిష్టయ్య, బీఆర్ఎస్ మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎస్డీ ఇబ్రహీం, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, పీఏసీఎస్ చైర్మన్ మంజూల, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, నాయకులు, నారాయణరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ నేతలు, ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జడ్పీ మాజీ వైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, పీసీసీ రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్ నాయకుడు కడెంపల్లి శ్రీనివాస్‌గౌడ్, షాద్‌నగర్ కాంగ్రెస్ కౌన్సిలర్ శాంతమ్మ, కొత్తూరు కౌన్సిలర్లు మాదారం నర్సింహాగౌడ్, అనీతాశ్రీనివాస్గౌడ్, సోమ్లానాయక్, మాధవీ గోపాల్‌గౌడ్, ఎంపీటీసీలు కృష్ణయ్య, జగన్మోహన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ మాదారం కృష్ణగౌడ్, కాంగ్రెస్ చౌదరిగూడ మండల అధ్యక్షుడు సుధాకర్, మంగులాల్‌నాయక్, కాంగ్రెస్ నాయకుడు సుజీవన్, యువజన కాంగ్రెస్ నాయకులు బీఎస్ సుధీర్, శ్రీకాంత్గౌడ్లతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.