ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 3 : ఇబ్రహీంపట్నంలో జడ్పీ అతిథి గృహం నిర్మాణం పూర్తి చేసి రెండేండ్లు అవుతున్నది. ప్రస్తుతం అతిథి గృహంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయం కొనసాగుతున్నది. కానీ, కాంట్రాక్టర్‌కు మాత్రం బిల్లులు రాక ఉన్నతాధికారుల చుట్టూ తిరిగి వినతిపత్రాలను అందజేసినా ఫలితం దక్కలేదు. దీంతో పలుమార్లు ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చేసేదేమీలేక సోమవారం ఇబ్రహీంపట్నం తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి, కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. నాలుగు సంవత్సరాల క్రితం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో రూ.50 లక్షలతో జిల్లా పరిషత్ అతిథి గృహాన్ని నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భవన నిర్మాణాన్ని చేపట్టారు.
కానీ, నిధులు సరిపోకపోవడంతో మధ్యలోనే పనులు నిలిచిపోయాయి. అదే సమయంలో పురాతనమైన తహసీల్దార్ కార్యాలయానికి సైతం పక్కా భవనం నిర్మించాలని ప్రభుత్వం నిధులు వెచ్చించింది. పాత భవనంలో కొనసాగిన తహసీల్దార్ కార్యాలయాన్ని తొలగించి, ఆ స్థానంలో నూతన భవన నిర్మాణం పూర్తయ్యే వరకు మరో భవనానికి తహసీల్దార్ కార్యాలయాన్ని మార్చాలని గత ప్రభుత్వంలో నిర్ణయించి తహసీల్దార్ కార్యాలయాన్ని జడ్పీ అతిథి గృహంలోకి మార్చారు. రెండేండ్లుగా తహసీల్దార్ కార్యాలయ కార్యకలాపాలు అతిథి గృహంలోనే కొనసాగుతున్నాయి. కానీ, కాంట్రాక్టర్ దానయ్యకు మాత్రం బిల్లులు చెల్లించడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.