న్యూస్ నెట్వర్క్, నమస్తే తెలంగాణ: ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగగా, కాల్వల్లో వరద ఉధృతి కొనసాగుతున్నది. చెరువులు, కుంటల్లోకి నీరు పుష్కలంగా చేరి మత్తడి దుంకుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టు, శివసాగర్ ప్రాజెక్టు, లక్నాపూర్ ప్రాజెక్టు, సర్పన్పల్లి, ఎబ్బనూరు తదితర చెరువులు అలుగు పారుతున్నాయి. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు నిండి జలకళను సంతరించుకున్నాయి. వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా ఉమ్మడి జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.