ఇబ్రహీంపట్నం, జూలై 27 : పంచాయతీ పాలకవర్గాల పాలన ముగిసి 19 నెలలు కావస్తున్నా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతూనే ఉన్నది. అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. పాలకవర్గాలుంటే మాత్రమే వచ్చే ఆర్థిక సంఘం నిధులు ఎప్పుడో నిలిచిపోవడంతో పంచాయతీల్లో పాలన కుంటుపడింది. గ్రామాల్లో పారిశుధ్య పనులు, సామగ్రి కొనుగోలు, ట్రాక్టర్ డీజిల్, వీధి దీపాలు, మంచినీటి నిర్వహణకు తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే వివిధ కార్యక్రమాల ఖర్చు మొత్తం కలిసి తడిసి మోపెడవుతున్నది.
సర్కారు నుంచి నిధులు విడుదల కాకపోవడం, సొంత డబ్బులు ఖర్చు చేయలేక నిత్యం పారిశుధ్య పనులు భారమవడంతో పంచాయతీ కార్యదర్శులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామాల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. గత నాలుగైదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో దోమలు, ఈగలు పెద్దఎత్తున ప్రబలి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడంపై చొరవ చూపాల్సిన ఉన్నతాధికారులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదని, గ్రామాలకు కూడా చుట్టపు చూపుగా వచ్చి పోతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
నిలిచిన నిధులు
గతేడాది జనవరిలో పంచాయతీ పాలకవర్గాల గడువు పూర్తి కావడంతో అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నది. దీంతో గ్రామపంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోవడంతో గ్రామాల్లో కనీస అవసరాలకు కూడా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. ట్రాక్టర్ల ద్వారా చెత్త సేకరణ, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, రోడ్లపై హరితహారం మొక్కలకు నీరు అందించడం, వీధి దీపాల నిర్వహణతో పాటు మరిన్ని పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటి నిర్వహణ కోసం పంచాయతీ కార్యదర్శులు అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆరోపిస్తున్నారు.
ప్రబలిన సీజనల్ వ్యాధులు
ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబలుతున్నాయి. దీనికి పారిశుధ్య నిర్వహణ అత్యంత కీలకం, వాటికి నిధుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఒక్కో కార్యదర్శి ఏడాది కాలంగా సుమారు 3లక్షల వరకు సొంత, ఇతరుల సహకారంతో ఖర్చు చేశారు. అందులో చిల్లిగవ్వ కూడా ఇప్పటి వరకు విడుదల కాలేదు. కేవలం మల్టిపుల్ వర్కర్ల వేతనాలను మాత్రమే గ్రామపంచాయతీ ఖాతాల్లో సర్కారు జమచేస్తున్నది. దీంతో గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణతో పాటు ఇతర పనులు భారంగా మారుతున్నాయని గ్రామపంచాయతీ కార్యదర్శులు ఆరోపిస్తున్నారు.
పంచాయతీల నిర్వహణ పట్టించుకోని ప్రత్యేకాధికారులు
పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం ముగిసి 19 నెలలు గడుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి నుంచి గ్రామపంచాయతీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించిన దాఖలాలు లేవు. గ్రామాల్లో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. సర్కారు స్పందించి గ్రామపంచాయతీల నిర్వహణ కోసం నిధులు కేటాయించడంతో పాటు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలి.
– చిలుకల బుగ్గరాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించాలి
గ్రామపంచాయతీల నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావల్సిన నిధులు కేటాయించాలి. గ్రామపంచాయతీల్లో ట్రాక్టర్లు, వీధి దీపాలు, పారిశుధ్యం, ఇతర నిర్వహణ పనులతో పాటు పంచాయతీ సిబ్బంది వేతనాలు అందించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నిర్వహణ కోసం సొంతంగా అప్పులు చేసి నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొన్నది. సర్కారు స్పందించి గ్రామపంచాయతీలకు నిధులు కేటాయించాలి.
– రాజ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి