రంగారెడ్డిజిల్లాలో రేషన్ బియ్యం వ్యాపారం బహిరంగంగా సాగుతున్నది. గ్రామాల్లో వ్యాపారులు నేరుగా ఇండ్ల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ చూసినా రేషన్ బియ్యం బహిరంగ మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్నది. కొంతమంది వ్యాపారులు నేరుగా గ్రామాలకు వెళ్లి పగటిపూట రేషన్ షాపులతోపాటు ప్రజల వద్ద కొనుగోలు చేసి రాత్రి పూట వాటిని గ్రామాల నుంచి తరలిస్తున్నారు. దీని కోసం ఏకంగా గోడౌన్లను అద్దెకు తీసుకుని ఆ బియ్యాన్ని వాటిలో నిల్వ ఉంచి రైస్ మిల్లర్లకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన సివిల్ సప్లయ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎక్కడా కనిపించడంలేదు. ఎస్వోటీ పోలీసులు అడపాదడపా దాడులు జరుపుతున్నారు. ఈ దాడుల్లో పెద్దఎత్తున రేషన్ బియ్యం పట్టుబడుతున్నది. జిల్లావ్యాప్తంగా రేషన్ బియ్యం వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతున్నది.
– రంగారెడ్డి, జనవరి 5 (నమస్తే తెలంగాణ)
రూ.15లకు కొని.. రూ.30కి విక్రయం
అక్రమ వ్యాపారులు గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఓ చోట నిల్వ ఉంచుతున్నారు. రాత్రి పూట గోడౌన్లకు తరలిస్తున్నారు. డీలర్లు కొంతమంది కార్డు యాజమానుల వద్ద రూ.10నుంచి రూ.15లచొప్పున కొనుగోలు చేసి.. ఏజెంట్లకు కిలోకు రూ.2, 3 ఎక్కువగా అమ్ముతున్నారు. రైస్ మిల్లులు, కోళ్ల ఫారాలకు రూ.30 నుంచి రూ.40 చొప్పున విక్రయాలు జరుపుతున్నారు. రైస్ మిల్లర్లు టన్నుల కొద్దీ రేషన్ బియ్యం కొనుగోలుచేసి వాటికి పాలిష్ చేసి రూ.50 నుంచి రూ.60చొప్పున విక్రయిస్తున్నారు. ఈ తతంగమంతా బహిరంగ మార్కెట్లో యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
ప్రతి నెలా జిల్లాకు 11,556 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం
జిల్లాకు ప్రతి నెలా 11,556 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందజేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 5,38,360 రేషన్ కార్డులుండగా.. 936 రేషన్ దుకాణాలున్నాయి. కార్డులున్నప్పటికీ కొంతమంది బియ్యం తీసుకోవడానికి రావడంలేదు. మరికొంతమంది రేషన్ షాపుల వద్దకు వెళ్లి బయోమెట్రిక్ పెట్టి డీలర్ల నుంచి డబ్బులు తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇలా మిగిలిపోతున్న బియ్యాన్ని వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు కొంతమంది కార్డుదారులు తమకొస్తున్న బియ్యాన్ని మధ్యదళారులకు విక్రయిస్తున్నారు. ప్రతి నెల జిల్లావ్యాప్తంగా సుమారు ఐదు నుంచి ఆరు మెట్రిక్ టన్నుల బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నట్లు తెలిసింది. ఈ వ్యాపారంతో మధ్యదళారులు కోట్ల రూపాయలను గడిస్తున్నారు.
కేసులు నమోదు
జిల్లాలోని యాచారం మండలం మేడిపల్లి, పల్లెచెల్కతండా, నందివనపర్తి, మొండిగౌరెల్లి గ్రామాల్లో ఇటీవల పోలీసులు రేషన్ బియ్యాన్ని పెద్దఎత్తున పట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు, కొహెడ ఎక్స్ రోడ్డు, ముకునూరు తదితర గ్రామాల్లో, చేవెళ్ల, షాద్నగర్, కందుకూరు డివిజన్లలో కూడా బియ్యాన్ని పట్టుకుని కేసులు నమోదు చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు కేంద్రంగా..
అక్రమార్కులు ఓఆర్ఆర్ను కేంద్రంగా చేసుకుని గోడౌన్లను అద్దెకు తీసుకుని జిల్లా నలుమూలల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని నిల్వ చేస్తున్నారు. నగర శివారుల్లోని మన్నెగూడకు చెందిన ఓ వ్యాపారి ఓఆర్ఆర్ పక్కనే గోడౌన్ను అద్దెకు తీసుకుని అక్రమ బియ్యం వ్యాపారాన్ని కొనసాగిస్తుండగా.. ఇటీవల జరిపిన పోలీసుల తనిఖీల్లో 14 టన్నుల బియ్యం పట్టుబడింది. కొంతమంది ఓఆర్ఆర్ సమీపంలో బియ్యం నిల్వ ఉంచి ఇటుక బట్టీల వద్ద పనిచేసే ఒడిశా కార్మికులు, రైస్ మిల్లులు, కోళ్లఫారాలకు పెద్దఎత్తున విక్రయిస్తున్నారు. రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు హెచ్చరిస్తున్నారు.