కులకచర్ల, మే 29 : రైతే రాజు.. రైతు బాగున్నప్పుడే రాష్ట్రం, దేశం కూడా మంచిగా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. కానీ, రైతు సమస్యల్లో ఉంటే వారిని పట్టించుకోవడంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. వికారాబాద్ జిల్లాలో వరి కోతలు పూర్తయ్యాయి. అన్నదాతలు ధాన్యాన్ని తేమ లేకుండా ఉండేందుకు కల్లాల్లో ఆరబెట్టి.. సమీపంలో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు తీసుకెళ్తే.. అక్క డి సిబ్బంది.. సరిపడా సంచులు లేవని.. హమాలీల కొరత ఉన్నదని చెబుతూ.. తూకం వేయడంలో నిర్లక్ష్యం చేస్తుండడంతో అన్నదాతలు ఆ వడ్లను అక్కడే కుప్పగా పోసి సంచులు కప్పుతూ.. రోజుల తరబడిగా ఎప్పుడు కొంటారా ..? అని ఎదురుచూస్తున్నారు.
అంతేకాకుం డా ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ఉం చిన ధాన్యం తడిసిపోసి మొలకలు వస్తుండడంతో అన్నదాత కన్నీరుమున్నీరవుతున్నాడు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని సెంటర్ల నిర్వాహకులు వెంటనే సేకరించి.. సంబంధిత రైతుల వివరాలను ట్యాబ్‌లో ఓపీఎంఎస్ చేసి ధాన్యాన్ని మిల్లులకు పంపించాల్సి ఉంటుంది. కానీ, కేంద్రాల్లో తూకం చేయపోవడంతో కురుస్తున్న వర్షాలకు తడిసి ముద్ద అవుతున్నాయి.
మొలకలు వస్తున్నాయి. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు చెప్పినా ఫలితం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మండలంలోని సాల్విడ్ కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు సక్రమంగా సాగడంలేదు. తూకం వేసిన వడ్లకు తీసుకెళ్లేందుకు లారీలు సరిపడా రాకపోవడంతో ఆ నిల్వలు పేరుకుపోతున్నాయి. తద్వారా తూకం వేయడంలేదు. అన్నదాతలు ట్రాక్టర్లలో తీసుకొచ్చిన ధాన్యాన్ని అలాగే ఉంచాల్సిన పరిస్థితి నెలకొన్నది.
క్వింటాకు మూడు నుంచి నాలుగు కిలోల తరుగు తీస్తూ..
కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని అక్కడి సిబ్బంది రైస్ మిల్లులకు తరలిస్తుండగా.. రైస్‌మిల్లర్లు ఒక్కో దగ్గర ఒక్కో విధంగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. క్వింటాకు మూడు నుంచి నాలుగు కిలోల వరకు తరుగు తీస్తామని చెబుతున్నారని.. అంత మొత్తంలో తరుగు తీస్తే తమ కేమీ మిగులుతుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కుప్పలుగా పోసి..
మండలంలోని తిరుమలాపూర్ పీఏసీఎస్ కేం ద్రంలో గత వారం, పది రోజులుగా ధాన్యాన్ని తూకం వేయకపోవడంతో.. అన్నదాత లు అక్కడే కుప్పలుగా పోసి టార్పాలిన్లు కప్పారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి పది రోజులు దాటుతున్నా ఇంకా తూ కం చేయడం లేదన్నారు. అకాల వర్షాలతో వడ్లు తడి సి పోయే ప్రమాదమున్నదని ఆందోళన చెందుతున్నారు.
డబ్బులు రావడం లేదు..
వడ్లను కొనుగోలు కేం ద్రంలో విక్రయించి 15 రోజులు దాటుతున్నా.. ఇంకా డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని అన్నదాతలు పేర్కొం టున్నారు. గతంలో ఇలాంటి ఎప్పుడు లేదని.. బీఆర్ఎస్ హయాంలో రెండు మూడు రోజుల్లోనే డబ్బులు తమ బ్యాంకుల్లోకి వచ్చేవని గుర్తు చేసుకుంటున్నారు.
ధాన్యాన్ని సేకరించడం లేదు..
కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లే తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలి. కానీ, వారు అలా చేయకపోవడంతో.. మిగిలిన రైతులు తమ ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి స్థలం సరిపోకపోవడంతో రోడ్ల పక్కన ఉంచాల్సి వస్తున్నది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి
-గుండుమల్ల నర్సింహులు తిరుమలాపూర్, కులకచర్ల
తరుగు తీస్తూ.. మోసం చేస్తున్నారు..
రైస్‌మిల్లుల నిర్వాహకులు తూకం చేసిన ధాన్యానికి తరుగు తీస్తున్నారు. క్వింటాకు మూడు నుంచి నాలుగు కిలోల వరకు తరుగు తీస్తుండడంతో తమకు తీవ్ర నష్టం జరుగుతున్నది. అతివృష్టి, అనావృష్టి తదితర కారణాలతో పంట దిగుబడి తక్కువగా వచ్చింది. ఇప్పుడు ఇలా తరుగు తీస్తే తమకు మిగిలేది స్వల్పమే. ప్రభుత్వం స్పందించి రైస్‌మిల్లుల నిర్వాహకులు తరుగు పేరిట చేసే మోసాన్ని అరికట్టాలి.
-శివకుమార్, తిరుమలాపూర్, కులకచర్ల