సాధారణంగా ఆదాయం వస్తుందంటే.. ఏ ప్రభుత్వ శాఖలైనా.. అధిక ప్రాధాన్యత ఇస్తాయి. ఇంకా ఆదాయం పెంచుకునేందుకు కొత్త మార్గాలను అన్వేషిస్తాయి. కానీ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి హెచ్ఎండీఏ, బల్దియా శాఖలు. భక్తనీరాజనాలతో నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడి విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో ఘనంగా నిమజ్జనం చేశారు. అయితే నిమజ్జనం అనంతరం భారీ సంఖ్యలో వ్యర్థాలు పోగయ్యాయి.
వీటిని తొలగించే బాధ్యత హెచ్ఎండీఏ తీసుకున్నా.. వాటిని తరలించి.. రీసైకిల్ వ్యవహారాలన్నీ బల్దియానే పర్యవేక్షిస్తున్నది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. విగ్రహాలకు సంబంధించిన ఉక్కు వ్యర్థాలపై మాత్రం సందిగ్ధత నెలకొంది. వీటిని ఏం చేయబోతున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. రెండు శాఖల మధ్య అవగాహన కొరవడటంతో తుక్కు వ్యర్థాలపై కోట్ల ఆదాయాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
-సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ)
హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాలను నిమజ్జనం చేశాక ఏర్పడే వ్యర్థాల తొలగింపు బాధ్యతలు హెచ్ఎండీఏ తీసుకున్నది. వాటిని తరలించి, రీసైకిల్ పనులను బల్దియానే పర్యవేక్షిస్తున్నది. అలాగే నగరంలోని ఇతర చెరువుల్లో వ్యర్థాల తొలగింపు బాధ్యతను జీహెచ్ఎంసీ తీసుకున్నది. హుస్సేన్ సాగర్ నుంచి తొలగించిన వ్యర్థాలను బల్దియానే తరలిస్తున్నది. కానీ ఇరు శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా విగ్రహాలకు సంబంధించిన ఇనుప వ్యర్థాలను ఏం చేయబోతున్నారనేది తెలియాలి.
రూ. 5 లక్షల లోపు విలువ చేసే పనులకు ఎలాంటి టెండర్లు లేకుండానే కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనులు అప్పగించే వీలు ఉండగా, ఇదే ప్రాతిపదికన కోట్లు విలువ చేసే ఐరన్ వ్యర్థాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. గతేడాది తొలగించిన 4వేల టన్నుల ఐరన్ వ్యర్థాలతో జీహెచ్ఎంసీకి రూ. 12 కోట్ల ఆదాయం సమకూరింది. కానీ హెచ్ఎండీఏ పరిధిలో హుస్సేన్ సాగర్‌లోని వ్యర్థాలతో వచ్చే ఆదాయం విషయంలోనే అసలు సమస్య నెలకొన్నది. ఇరు సంస్థల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇనుప వ్యర్థాల ద్వారా ఆదాయం విషయంలో సందిగ్ధత నెలకొన్నది.